బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ | Union Home Minister Shri Amit Shah Sakala Janula Vijaya Sankalpa Sabha in Warangal | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌

Published Sun, Nov 19 2023 4:22 AM | Last Updated on Sun, Nov 19 2023 4:23 AM

Union Home Minister Shri Amit Shah Sakala Janula Vijaya Sankalpa Sabha in Warangal  - Sakshi

2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి 
బీఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా కుటుంబ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్‌ పార్టీ రెండు తరాల 2జీ.. ఓవైసీ పార్టీ మూడు తరాల 3జీ. కాంగ్రెస్‌ పార్టీ 4జీ.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, ఇప్పుడు రాహుల్‌గాంధీ. ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. చందమామపైకి చంద్రయాన్‌ను తీసుకెళ్లిన మోదీకి అవకాశం ఇవ్వాలి. 

అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం
బీఆర్‌ఎస్‌ సర్కారు తెలంగాణను అక్రమాలు, ఆక్రమణలు, కుంభకోణాల రాష్ట్రంగా తయారు చేసింది. బీఆర్‌ఎస్‌ అంటేనే భ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి. మియాపూర్‌ భూముల్లో రూ.4 వేల కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డులో రూ.3,300 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల  కోట్ల అవినీతి జరిగింది.  బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ అవినీతి, కుంభకోణాలపై  విచారణ జరిపి జైలుకు పంపడం ఖాయం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, వరంగల్‌: తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని.. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పంచుతామని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శనివారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నల్లగొండ జిల్లా కేంద్రం, వరంగల్‌లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కేసీఆర్‌ అబద్ధాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేదు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు రూ.3 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారింది. దళితబంధు పథకం పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం కావాలా, కేసీఆర్‌ మోసపూరిత అబద్ధాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించాలి. కమలం గుర్తుపై బటన్‌ నొక్కి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. 

బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం 
తెలంగాణలో 52 శాతం ఓబీసీలే. 135 బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ బీసీ వ్యతిరేక పార్టీలు. అవి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశాయి. బీసీల గురించి ఆలోచించే బీజేపీ ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో తన కుమారుడిని సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తుంటే.. కేంద్రంలో తన కుమారుడిని ప్రధానిని చేయాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు.

అదే బీజేపీ అధికారంలోకి వస్తే మా బిడ్డలో, కొడుకులో, బంధువులో సీఎం, ప్రధాని కారు. ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం చేస్తాం. తెలంగాణ బడ్జెట్‌లో బీఆర్‌ఎస్‌ సర్కారు ఎంబీసీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి.. రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేంద్రంలోని ప్రధాని మోదీ కేబినెట్‌లో 27మంది బీసీ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ కూడా బీసీయే. ఈ ఘనత బీజేపీకే దక్కుతుంది. జాతీయ బీసీ కమిషన్‌కు సర్వాధికారాలు ఇచ్చాం. సవరణ చేయడానికి రాష్ట్రాలకు హక్కు కల్పించాం. జాతీయ స్థాయిలో జరిగే ఎంబీబీఎస్‌ పరీక్షల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్‌ ఇచి్చన ఘనత బీజేపీదే. 

పేపర్‌ లీకేజీలతో యువత జీవితాలు నాశనం 
బీఆర్‌ఎస్‌ సర్కారు టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలతో యువత జీవితాలను నాశనం చేసింది. పేపర్‌ లీకేజీల వల్ల ప్రవళిక, రహ్మత్‌ల ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పారదర్శకంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.  

ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం 
కాంగ్రెస్‌ 70 ఏళ్లుగా అయోధ్య రామమందిర నిర్మాణ విషయాన్ని వివాదాస్పదం చేసింది. కానీ మోదీ రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 22న మందిరాన్ని ప్రారంభిస్తాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం..’’ అని అమిత్‌షా ప్రకటించారు. ఈ సభల్లో సీనియర్‌ నేతలు కె.లక్ష్మణ్, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్‌ కాళీప్రసాద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పాలి: డీకే అరుణ 
ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నాయకుడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణను కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ కుటుంబం అన్ని వర్గాలను మోసం చేసి, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలకు గుణపాఠం చెబితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.

కారు స్టీరింగ్‌ ఒవైసీల చేతుల్లో.. 
నిజాం పాలన నుంచి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తెలంగాణకు స్వేచ్ఛ ప్రసాదిస్తే.. సీఎం కేసీఆర్‌ ఒవైíసీకి లొంగిపోయి విమోచన దినోత్సవం చేయడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని రాష్ట్ర అవతరణ దినంగా నిర్వహిస్తాం. బీఆర్‌ఎస్‌ గుర్తు కారు అయినా.. దాని స్టీరింగ్‌ ఒవైసి చేతుల్లో ఉంది.

ముస్లింలను సంతోషపెట్టేందుకే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. భద్రాచలంలో రాములవారికి సీఎం పట్టువ్రస్తాలు సమర్పించే ఆనవాయితీని మరిచిపోయారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ వస్తే వాటిని రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. వాల్మికుల సమస్యలను కేసీఆర్‌ కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే వారి సమస్యను పరిష్కరిస్తాం. 

తెలంగాణ అభివృద్ధికి ఐదు లక్షల కోట్లు 
రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ అన్యాయం చేసింది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ సర్కారు ఉమ్మడి ఏపీకి రూ.2లక్షల కోట్లు ఇస్తే.. తర్వాతి తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది.

తెలంగాణలో హైవేల అభివృద్ధికి, సమ్మక్క–సారలమ్మ జాతర, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు, వందేభారత్‌ రైళ్లు, రైల్వేస్టేషన్లలతోపాటు ఇతర అభివృద్ధి పనులు కలిపితే రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చాం. కేసీఆర్‌ ప్రభుత్వం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంజీఎంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement