‘సభ్యత్వం’పై వద్దు అలసత్వం: పీసీసీ చీఫ్‌ రేవంత్‌ హెచ్చరిక 

Tpcc Chief Revanth Warns On Leaders About Congress Membership - Sakshi

కాంగ్రెస్‌ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ హెచ్చరిక 

మండలస్థాయిలో బలోపేతం కావాలి

బూత్‌లో కనీసం వంద సభ్యత్వాలు

క్రియాశీలకంగా లేకుంటే ఎంతటి

వారైనా నష్టపోతారని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: సంస్థాగత బలమే పార్టీకి ప్రాణమని, క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం మండలాల ప్రాతిపదికన కార్యాచరణ రూపొం దించుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రాష్ట్రంలోని 34 వేల పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ప్రతి బూత్‌కు 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశిం చారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో రేవంత్‌ సమీక్షించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదును క్రియాశీలకంగా నిర్వహించాలని కోరారు. దేశంలోనే తెలంగాణను ఆదర్శవంతంగా నిలపాలని సూచించారు. సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఎంతటివారైనా నష్టపోతారని హెచ్చరించారు.  

బలముంటేనే కొట్లాడగలం 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఈ ప్రభుత్వాలపై కొట్లాడగలమని పార్టీ నేతలకు రేవంత్‌ స్పష్టం చేశారు. ‘‘ఐదు మండలాల్లో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ స్థానాన్ని, 35 మండలాల్లో బలంగా ఉంటే లోక్‌సభ స్థానాన్ని గెలుస్తాం. అదే 600 మండలాల్లో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. మండలాల్లో అధ్యక్షులు సరిగా పనిచేయకపోతే వారిపై చర్యలు ఉంటాయి. ప్రతి మండలంలో 10వేలు, నియోజకవర్గంలో 50వేలు, ఎంపీ స్థానం పరిధిలో 3.5లక్షల సభ్యత్వం చేసిన వారికి రాహుల్‌ గాంధీతో సన్మానం చేయిస్తాం’’అని చెప్పా రు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్‌జాన్, చిన్నారెడ్డి, గోపిశెట్టి నిరంజన్, వేం నరేందర్‌రెడ్డి, సోహైల్‌ పాల్గొన్నారు.  

‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ అండ’
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని, దీని కారణంగానే బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ ముందు ఆందోళన చేస్తున్నారని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 317 జీవో రద్దయ్యేవరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయ సంఘం మాజీ నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  రేవంత్‌ మాట్లాడుతూ   ఉద్యోగుల భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్న 317 జీవోపై పోరాటం చేసేందుకే హర్షవర్ధన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నామని, ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంటుం దని చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అందరం కలసి కాం గ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top