నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి.. రేవంత్‌రెడ్డి ఫైర్‌

Tpcc Chief Revanth Reddy Comments On Cm Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని, పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని, అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. నిజాం నిరంకుశ పాలన.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి.. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెట్టలేదు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు.

‘‘నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిచేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించాం. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచాం. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలి. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలి. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి’’ అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.

‘‘ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు... తెలంగాణ  ఆత్మగౌరవం కోసం.. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఎవరు సీఎంగా ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తాం.. కేసీఆర్ కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదు... ఆయన రాచరికం అనుకుంటున్నారు’’ అంటూ రేవంత్‌ దుయ్యబట్టారు.

రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయి. 2 వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే పెంషాన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోంది.  కేసీఆర్ సవాల్‌లో పస లేదు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1 లక్షా 80 వేలు బాకీ ఉన్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమే. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారు.. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహం. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు.. ఇప్పటికీ అతీగతి లేదు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా..  బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు?’’ అని రేవంత్‌ మండిపడ్డారు.

‘‘దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన. మంద కృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఢిల్లీ వెళదాం.. మోదీని కలిసి ఆర్డినెన్స్‌కు మద్దతు ఇస్తామని నేను చెబుతా.. అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కోరదాం. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తాం. 24 గంటల కరెంటుపై ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం’ అని రేవంత్‌ తెలిపారు.

ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయి. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుంది. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top