
రాహుల్‌తో భేటీ.. మంత్రి వర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి చర్చించారు. కేబినెట్‌లో ఆరు పదవులు ఖాళీ ఉండగా.. ఐదుగురిని భర్తీ చేస్తారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో రామచంద్రనాయక్, బాలు నాయక్ పేర్లు పరిశీలనలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు.
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ అంశంపై రాహుల్‌తో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారన్నారు. కేబినెట్ విస్తరణపై మా అభిప్రాయాలు ఇప్పటికే చెప్పాం. రేపో, మాపో టీపీసీసీ కార్యవర్గం ప్రకటన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, జై భీమ్ జై సంవిధాన తదితర అంశాలపై చర్చించానని మహేష్ గౌడ్ తెలిపారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసానని.. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీలైనంత త్వరగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరా.. త్వరగా చేస్తామని చెప్పారు.
ఇవాళ, రేపటిలోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి రెండు, సార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపాం. తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరాం’’ అని మహేష్ గౌడ్ వెల్లడించారు.