
సాక్షి, ములుగు: ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. అంతేగానీ రోడ్ల మీదకు రావొద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆడబిడ్డలంటే నీకు గిట్టదు. సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది. నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. ఎందుకు?. ఇలా చేసి నువ్వు సాధించిందేది ఏమిటి?. కేటీఆర్.. నీకు ఎందుకు ఇంత అహంకారం. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం ఎవరిని జైలుకు పంపించాం.
70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను తప్పులు చేశానని చెప్పడం కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి. అంతేగానీ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి రోడ్లమీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం.
.. పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ములుగులో సీతక్క రాజ్యం . పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా?. ములుగు లో నడుస్తుంది ప్రజారాజ్యం .ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి. నిలదీయండి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపియడం ప్రజలు గమనిస్తున్నారు. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్నావా కేటీఆర్. మేం సమ్మక్క సారక్క వారసులం. మా జోలికి వస్తే నాశనమై పోతావు అని మంత్రి సీతక్క అన్నారు.
తాజాగా మంత్రి పొంగులేటితో జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు శాంతి భద్రతలు కాపాడాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతల అరెస్టుతో ములుగు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.