వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చే తీర్మానం బయటపెట్టాలి

Telangana: DK Aruna Demand To Include Valmiki Boya Community In St List - Sakshi

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ    

సాక్షి, హైదరాబాద్‌: వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలపడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెబుతున్న పత్రాన్ని సీఎం కేసీఆర్‌ విడుదల చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ఆదివారం పాలమూరు జిల్లా సభలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర ఏళ్లు గడుస్తున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారడానికి కేసీఆర్‌ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణే కారణమని ఆరోపించారు.

ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని కేసీఆర్‌.. కేంద్రం అడ్డంకులు పెడుతోందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కేవలం తన కుటుంబ సభ్యులను అవినీతి కేసుల నుంచి ఎలా తప్పించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు.

అవినీతికి పాల్పడితే సొంత బిడ్డను కూడా విడిచిపెట్టనని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్‌.. తన కూతురి విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మంత్రి మల్లారెడ్డి గురించి  సీఎం గొప్పగా మాట్లాడటాన్ని బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిని ఆయనే ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top