చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారు: తీన్మార్ మల్లన్న

సాక్షి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం రాత్రి కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో తనను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని సామాన్యుడినైన తనను పట్టభద్రులు భుజాలపై ఎక్కించుకుని మోశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా నల్లగొండ కౌంటింగ్ వైపే చూశారన్నారు. ప్రగతిభవన్ గోడలు బద్దలుకొట్టే రోజులు వస్తాయని, సీఎం కుర్చీపై సామాన్యుడిని కూర్చోబెట్టే వరకు తన ఉద్యమం ఆగదని మల్లన్న స్పష్టంచేశారు. డబ్బున్న వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలనే దానికి ఎన్నికలు సమాధి కట్టాయని, అధికారపక్షం తలదించుకునేలా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ప్రజలు తనను డిస్టింక్షన్‌లో గెలిపించాలని చూశారు కానీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నకిలీ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు.