Uddhav Thackeray Resignation: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం.. కారణం వాళ్లే: రెబల్స్‌

Shiv Sena Rebels Unhappy With Thackeray Resignation - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్‌ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉద్ధవ్‌ థాక్రే ముఖ్యమంత్రి పదవికి.. ఎమ్మెల్యేకు రాజీనామా,  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు దగ్గర పడిన టైంలోనే తిరిగి స్వరాష్ట్రంలో అడుగుపెట్టాలని, మద్ధతు ప్రకటించాలని షిండే వర్గం భావిస్తోంది. అయితే.. 

ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్‌థాక్రే రాజీనామా చేయడం తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదని రెబల్స్‌లో కొందరు భావిస్తున్నారు. ఉద్దవ్‌ థాక్రే మేం లేవనెత్తిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన రాజీనామా మాకేం సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పోరాడుతున్నప్పుడు.. మా నాయకుడిపై కూడా కోపం తెచ్చుకున్నందుకు మేమంతా బాధపడ్డాము.. 

అందుకు కారణం.. ఎన్సీపీ, సంజయ్‌ రౌత్‌. ప్రతీరోజూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేసిన కామెంట్లే.. మాలో అసంతృప్తిని రగిల్చాయి. వాళ్ల వల్లే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు చెడిపోయి.. పొసగని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా సంజయ్‌ రౌత్‌ జోక్యాలు ఎక్కువై పోవడం పట్ల మాలో చాలామందికి అసంతృప్తిగా ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో పాటు బీజేపీతో జట్టు కట్టడంపై మేమంతా ఏకతాటిగా నిలిచి డిమాండ్‌ చేశాం అని రెబల్‌ ఎమ్మెల్యే దీపక్‌ కేసర్‌ఖర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఎనిమిది రోజుల కిందట మొదలైన మహారాజకీయ సంక్షోభం.. బుధవారం రాత్రి ఉద్దవ్‌ థాక్రే రాజీనామాతో తెర పడింది. మహా వికాస్‌ అగాఢి కూటమిని వ్యతిరేకిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌ సూరత్‌కు చేరుకు‍న్నారు షిండే. ఆ సమయంలో  ముంబై నుంచి మంతనాలు మొదలుకావడంతో.. రెబల్‌ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు గువాహతి(అస్సాం)కు షిప్ట్‌ చేశారు. అక్కడ మరికొందరు తిరుగుబాటుకు మద్ధతు ప్రకటించారు.  నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలు పది మంది ఇతరులు.. మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు కూటగట్టుకున్నాడు ఏక్‌నాథ్‌ షిండే.

చదవండి: మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top