బిహార్‌ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన | Samrat Choudhary set to become next Bihar CM | Sakshi
Sakshi News home page

బిహార్‌ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన

Apr 14 2026 4:15 PM | Updated on Apr 14 2026 4:46 PM

 Samrat Choudhary set to become next Bihar CM

పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.

సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

సామ్రాట్‌ చౌదరి ఎవరు? 
సామ్రాట్‌ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.

సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్‌ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

సీఎం రేసులో కీలక నేతలు

సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే.
 

Advertisement
 
Advertisement
Advertisement