విధ్వంసానికి పాల్పడింది చంద్రబాబే

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

అరటి, చెరుకు తోటలు తగుల బెట్టించింది మీరు కాదా? 

బాబు ఓ లిటిగెంట్‌.. ప్రతి పనినీ అడ్డుకోజూస్తున్నారు

కరోనా రికవరీ రేటు గురించి ఎందుకు మాట్లాడరు?

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దంటే కమ్యూనిస్టులు మాట్లాడరా?

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, అమరావతి పేరు చెప్పి సొమ్ము వెనకేసుకునే యత్నంలో అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన దోపిడీ కోసం చంద్రబాబు సృష్టించుకున్న స్వప్నాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విధ్వంసం చేసి ఉండవచ్చన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబుకు అధికారం పోయాక విధ్వంసం కలలు వస్తున్నట్టున్నాయి. ఆయన డీఎన్‌ఏలోనే విధ్వంసం ఉంది. విధ్వంసానికి ఆయన మారు పేరు. కొందరికి రాత్రి పూట పీడ కలలు వస్తే వాటి తాలూకు వణుకు తెల్లవారినా పోదు. చంద్రబాబు 14 నెలల క్రితం అధికారానికి దూరం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఏ రూపంలో విధ్వంసం జరిగిందో చంద్రబాబు చెప్పాలి. అమరావతి పేరుతో భారీగా సొమ్ము వెనకేసుకోవాలనే క్రమంలో ఆయన నిజమైన విధ్వంసానికి పాల్పడ్డారు. అన్ని వ్యవస్థలను కుళ్లిపోయేట్లుగా చేశారు. రూ.3.20 లక్షల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రజల నెత్తిమీద పడేసి వెళ్లిన ఈ వ్యక్తి ఈ రోజు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు.

ఇది విధ్వంసమా?
► ప్రజలకు సంక్షేమాన్ని డోర్‌ డెలివరీ వరకు తీసుకు వెళ్లడం విధ్వంసమా? 
►వలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేయడం విధ్వంసమా?
►సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించడం విధ్వంసమా?
►ప్రతి పైసా కూడా నేరుగా అర్హులైన లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లేలా చేయడం విధ్వంసమా? బాబు, ఆయన పుత్రరత్నం ప్రజల్లోకి రావడానికి భయపడుతూంటే ఆ పార్టీని ఏమనాలి? జూమ్‌ పార్టీ, వీడియో కాన్ఫరెన్స్‌ పార్టీ అనాలా? అరటి, చెరుకు తోటలు తగల బెట్టించింది మీరు కాదా? 

ఆ ఉద్యమం అభూత కల్పన 
► అమరావతి ఉద్యమం ఒక అభూత కల్పన. చంద్రబాబు మనుషులు పది మంది తమ భూముల రేట్ల కోసం టీవీ కెమెరాలు రాగానే అరుస్తూ ఒక పద్ధతి ప్రకారం డ్రామాలాడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు పది వేలు వస్తున్నాయని వాపోతున్న బాబు.. రికవరీ రేటులోగానీ, క్వారంటైన్‌ సదుపాయాల్లో గానీ దేశంలోనే మెరుగైన రాష్ట్రాల్లో ఏపీ ఉందన్న నిజాన్ని ఎందుకు మాట్లాడటం లేదు?
►చంద్రబాబు ఆఖరుకు లిటిగెంట్‌లా తయారై కోర్టులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవాలని చూస్తున్నారు.  

బాబు ఓ ప్రాంతానికే పరిమితం
► కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించే ఆస్పత్రుల విషయంలో చంద్రబాబు ప్రజా నాయకుడిగా వ్యవహరించడం లేదు. తనకు ఏ కులంతోనూ సంబంధం లేదని చెబుతూనే తన వైఖరితో తన సొంత కులానికి కూడా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు. 
► కులాలపై ఆధారపడి రాజకీయం చేస్తే అధికారంలోకి రాలేరు. కానీ చంద్రబాబు ఒక కులానికి, ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైపోయాడు.  పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదన్న చోట శాసనసభలు ఉండకూడదు అన్న మంత్రి కొడాలి వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయన వ్యాఖ్యలతో మేం ఏకీభవిస్తున్నాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అంటుంటే ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్‌లు నోరెందుకు మెదపడం లేదు? 
► టీడీపీ ఏదో లిటిగేషన్‌ పెట్టి పాలన వికేంద్రీకరణను అడ్డుకోవాలని చూస్తోంది. కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది. సుప్రీం కోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. 
అధికారులు పర్మిషన్‌ ఇవ్వకుండా ఏదీ జరగదు. అయితే వాళ్లను బాధ్యుల్ని చేస్తామా? ప్రాథమిక బాధ్యత రెంట్‌కి తీసుకున్నవాళ్లపైనే ఉంటుంది. అంటే ప్రాథమిక బాధ్యత రమేష్‌ హాస్పిటల్స్‌దే. అది కాదని ఎవరన్నా అంటే అంతకన్నా దుస్సాహసం మరొకటి ఉండదు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top