మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి

RS Praveen Kumar agitation at school - Sakshi

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

సూర్యాపేట రూరల్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్‌ కుమార్‌ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు.

‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్‌ స్తంభించింది. కలెక్టర్‌ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్‌కుమార్‌కు వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top