సబ్‌ స్టేషన్ల వద్దే తేల్చుకుందాం | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్ల వద్దే తేల్చుకుందాం

Published Sun, Jul 16 2023 12:38 AM

Revanth every challenge on free electricity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌పై రాజుకున్న మంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరింత ఆజ్యం పోశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి శనివారం ఆయన కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ ఉచిత విద్యుత్‌పై రెఫరెండానికి సిద్ధమని చెపుతూనే మెలిక పెట్టారు.

‘రాష్ట్రంలో 3,500 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ప్రతి సబ్‌స్టేషన్‌ దగ్గర గ్రామ సభలు పెడదాం. ఆయా సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లు, లైన్‌ ఆఫ్‌ కరెంటు రికార్డులు పరిశీలిద్దాం. బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ రైతులకు ఇచ్చి ఉంటే.. అలా ఇచ్చిన సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రజలను ఓట్లు అడగం. ఇవ్వలేదని తేలితే బీఆర్‌ఎస్‌ వాళ్లు ఓట్లు అడగొద్దు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

ఈ విధమైన రెఫరెండానికి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలమంతా సిద్ధంగా ఉన్నాం.’అంటూ ప్రతి సవాల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. శనివారం గాందీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఇప్పటికే నల్లగొండలో నిరూపించాం.. 
రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదని తమ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు ఇప్పటికే నిరూపించారని రేవంత్‌ అన్నారు. నల్లగొండ జిల్లాలోని 350 సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లను ఆ జిల్లా ఎస్‌ఈ దగ్గర సీజ్‌ చేయించారని చెప్పారు.

2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము 2014కు ముందు ఇచ్చిన 9 గంటల విద్యుత్‌నే కొనసాగించారని, అదీ 36 సార్లు కోతలు విధించి ఇచ్చారని విమర్శించారు. 2018 వరకు ఈ తొమ్మిది గంటల కరెంటే కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్దనే రచ్చబండ పెట్టి ప్రజాక్షేత్రంలో తీర్పు అడుగుదామని, దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రెఫరెండానికి సిద్ధం కావాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు.  

చంద్రబాబుతో అంటకాగి కేసీఆర్‌ మనుగడ సాధించాడు 
‘అప్పటి టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆర్థిక సహకారంతోనే కేసీఆర్‌ పార్టీ పెట్టాడు. 2009లో తెలుగుదేశం పారీ్టతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబుతో అంటకాగి టీడీపీ దయాదాక్షిణ్యాలతో మళ్లీ రాజకీయాల్లో మనుగడ సాధించాడు.

మంత్రి హరీశ్‌ వార్డు మెంబర్‌గా గెలవనప్పుడే కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆ పారీ్టల మీద బతికి, పెరిగి వారినే తిట్టే నీచమైన సంస్కృతి కేసీఆర్‌ది. ఇప్పటికైనా ఇలాంటి సంస్కృతిని వదిలి నిజాలు మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారు..’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.  

గుత్తా, పోచారంను బర్తరఫ్‌ చేయాలి.. 
‘స్పీకర్, కౌన్సిల్‌ చైర్మన్‌ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు మాట్లాడవచ్చా? రాజకీయ విమర్శలు చేయవచ్చా?..’అని రేవంత్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ తక్షణమే వారిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ మళ్లీ గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలి.. 
బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్మాయని, కాంగ్రెస్‌ పాలనలో కారు చీకట్లు కమ్ముకున్నాయని చెపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలకు దమ్ముంటే రెండు పనులు చేయాలని, అలా చేస్తే తాను వ్యక్తిగతంగా ఏ శిక్షకైనా సిద్ధమేనని రేవంత్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే మళ్లీ గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించాలని అన్నారు.

గజ్వేల్‌ కాకుండా ఆలేరు, కామారెడ్డిల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్‌ సర్వేలు చేయించుకుంటున్నారని చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్‌ఎస్‌ ఓటమిని ఒప్పుకున్నట్టేనని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘ఈ రెండేళ్లలో ఎప్పుడైనా కేసీఆర్‌ నా పేరు తీసిండా? నా కళ్లలోకి చూసిండా? ఆయనకు భయం. దమ్ముంటే కేసీఆర్‌ను బయటకు బయటకు వచ్చి మాట్లాడమనండి..’అంటూ సవాల్‌ విసిరారు. 

Advertisement
Advertisement