Eenadu Ramoji Rao Fake News On GPS Pension Scheme - Sakshi
Sakshi News home page

ఊహించినట్లే విషం కక్కారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ?

Published Fri, Jun 9 2023 10:23 AM

Ramoji Eenadu Fake News On Gps Pension Scheme - Sakshi

ప్రభుత్వ నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తే, దానిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ పాయింట్లను విశ్లేషించవలసిన ఒక వర్గం మీడియా దారుణమైన రాతలకు పాల్పడింది. అసలు వార్తను కాకుండా, ఉద్యోగులకు దగా..దగా.. అంటూ పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టిన ఈనాడు మీడియాను ఏమనాలి!.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చండాలంగా మాట్లాడడానికి సాహసించలేదు. కాని ఈనాడు మాత్రం ఏదో విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టాలని విశ్వయత్నం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అసంతృప్తి చెంది ఉంటే ఈపాటికి ఎంత ఆదోళన వచ్చేది. అది జరగలేదనే బాధతో ఈనాడు మీడియా తనే ప్రతిపక్షం అనుకుని జర్నలిజం విలువలకు పాతరేస్తూ రాసింది.

మామూలుగా అయితే ఏమి చేయాలి?. ముందుగా అసలు క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? దాని పరిణామం ఏమిటి? అన్నదాని గురించి తొలుత వార్తను ఇవ్వాలి. ఆ తర్వాత నిజంగా ఎన్.జి.ఓ.లకు అన్యాయం జరిగితే దాని గురించి ఇవ్వవచ్చు. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు దగా చేశారని నీచంగా రాశారు. గత ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై గట్టిగా పరిశీలన చేశారు. అదే సందర్భంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇంతగా ఉంటాయని ఊహించలేదని, అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన జీపీఎస్‌ను తీసుకు వస్తున్నామని కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఇలా నిజాయితీగా ఎంతమంది చెబుతారు.

గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్ని విన్యాసాలు చేశారో గుర్తు లేదా!. చివరికి రుణమాఫీ చేసేశాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలా అసత్యాలు చెప్పినవారేమో గొప్పవారట. ఇప్పుడు నిజాయితీగా సమస్యను వివరించినవారేమో దగా చేసినట్లట. ఇలా ఉంది ఈనాడు మీడియా సూత్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ ఇచ్చిన హామీలు పదింటిలో ఎనిమిదిని నెరవేర్చితే దాని గురించి చెప్పరు. మిగిలిన రెంటిలో కొంతమేర తీర్చారు. అయినా సీపీఎస్ రద్దు చేయలేదని, దగా అని చెడరాశారు. మరి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు దానిని రద్దు చేయలేదు?. పోనీ ఎన్.జి.ఓలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్ని అమలు చేశారు?  వాటిపై ఎప్పుడైనా సమీక్షకు ఎల్లో మీడియా సిద్దం అవుతుందా? ఆ పని చేయరు. కేవలం బురదచల్లుడే లక్ష్యంగా పెట్టుకున్నారు.
చదవండి: జగన్‌ దూకుడు.. పచ్చ బ్యాచ్‌కి కడుపులో మంట

దీని అంతటికి ఒకటే కారణం. తమకు కావల్సినవారు అధికారంలో లేరన్న దుగ్దతో పాటు , తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని ఆర్ధిక అక్రమాలన్నిటిని జగన్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందన్న కసి, కక్షతో ఇలాంటి నీచమైన రాతలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా ఈ మీడియాది ఏడుపుగానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు.. వారికి అన్యాయం చేశారు అని రాస్తారు. ముందుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆ తర్వాత రాస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు.

సీపీఎస్ బదులు వచ్చిన జిపిఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి నెల బేసిక్ లో ఏభై శాతం మొత్తాన్ని పెన్షన్ తో పాటు ఏటా రెండు రెండు కరువు భృతి(డి.ఆర్.) ఇవ్వాలని సంకల్పించారు. దీనివల్ల ఉద్యోగికి నష్టం ఏమీ ఉండదు. తొలుత చివరి జీతం బేసిక్ లో 33శాతం పెన్షన్ గా ఇవ్వాలని ప్రతిపాదించినా, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ దానిని ఏభై శాతంగా చేశారు. ఉన్నంతలో మెరుగైన స్కీమ్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా ఓకే చేశాయి. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో ఈ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది.

అయినా ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నట్లుగా ఈనాడు, జ్యోతి వంటి తెలుగుదేశం మీడియా శక్తి వంచన లేకుండా దుష్ప్రచారం చేశాయి. ఒక విషయాన్ని విశ్లేషించడం వేరు. విషపూరితంగా రాయడం వేరు. ఎల్లో మీడియా చేస్తున్నది విషపూరిత ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. కొంతకాలం క్రితం టీచర్లు తమ డిమాండ్ ల కోసం విజయవాడకు వచ్చారు. అప్పుడు ఈ మీడియాలు పండగ చేసుకున్నాయి. కాని ఆ తర్వాత ప్రభుత్వం ఆయా అంశాలలో తీసుకుంటున్న శ్రద్ద కారణంగా అలజడి పెద్దగా లేదు. అది ఈనాడుకు, జ్యోతికి కడుపు మంటగా ఉంటోంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వారు ప్రభుత్వంపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో అసలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించింది ఆయనే. తత్ఫలితంగానే ఒకే పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడు జగన్ దానిని తొలగించే యత్నంచేస్తే అది కూడా వెన్నుపోటే అని తప్పుడు వార్తలు రాశారు. చంద్రబాబు 2004 కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూసివేశారు. అప్పుడు ఆయనను గొప్ప సంస్కరణవాదిగా ఈనాడు ప్రచారం చేసింది. ఇప్పుడేమో టిడిపి పూర్తిగా తిరోగమనంలో ఉన్నా ఈనాడుకు తియ్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోంది. వారిని తన కుటుంబ సభ్యులని జగన్ పలుమార్లు ప్రకటించారు.

అదే చంద్రబాబు టైమ్‌లో అయితే ఉద్యోగులను ఎన్ని రకాలుగా యాతనలకు గురి చేసేవారో అనుభవించినవారందరికి తెలుసు. కేవలం కొద్ది మంది నాయకులను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కధ నడిపేది. కాని జగన్ ఉద్యోగుల అవసరాలను తీర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతగా గగ్గోలు పెడుతోంది కదా! తన సంస్థలలో ఉద్యోగుల పట్ల ఇలాగే కనికరంతో ఉంటున్నదా? వారికి కూడా మంచి పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఎప్పుడైనా భావించిందా?ఈనాడుకు మంచి లాభాలే వస్తాయి కదా! కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల జీతాలపై అప్పుడప్పుడు ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేస్తుంటుంది. వారి సిఫారస్‌లను యాజమాన్యాలు అమలు చేయవలసి ఉంటుంది. కాని ఎప్పుడూ ఆ సిఫారస్ లను యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు.

ఈనాడు రామోజీరావు అయితే తన సంస్తలోని జర్నలిస్టులందరితో తమకు సగం జీతాలు ఇస్తే చాలని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడాచేయించుకున్న ఘట్టాలు ఉన్నాయి. అసలు తమ సంస్థలలో యూనియన్లనే అనుమతించని రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గురించి మాత్రం చాలా బాదపడుతున్నారు. వీరి రాతలను చూసి ఉద్యోగులు మోసపోకూడదనే ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. వారికి ఇంకేమైనా కోరికలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవచ్చు.

ఈనాడు, జ్యోతి రాసే అబద్దాలు నమ్మి భిన్నమైన మార్గంలోకి వెళితే, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు కాని, సమయం మించి పని కాని పెద్దగా లేవు. అదే చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన సోది ఉపన్యాసం వినలేక చచ్చేవారమని పలువురు అధికారులు, ఉద్యోగులు వాపోతుండేవారు. జగన్ తాను మాట ఇచ్చిన నేపధ్యంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే చంద్రబాబు అయితే దానిని ఎలా ఎగవేయాలా అని ఆలోచిస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. కనుక ఉద్యోగులు వీటన్నిటిని గమనించి ప్రభుత్వంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?

Advertisement
 
Advertisement
 
Advertisement