జగన్‌ దూకుడు ఊహించని పచ్చ బ్యాచ్‌.. కడుపు మంటతో పెన్ను కదలని యెల్లో మీడియా!

Kommineni Comment: CM Jagan Over Polavaram Action Jealousy CBN - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అరుదైన ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన పోలవరం ప్రాజెక్టుకు ఒకేసారి 12, 911 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కేంద్రమంత్రి వర్గం ఆమోదించడమే తరువాయి. కొద్ది కాలం క్రితం జగన్ ప్రధాని మోదీని, ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి పోలవరం నిధులు గురించి చర్చించారు. ఒకేసారి అడ్ హాక్ గా పదివేల కోట్లు ఇస్తే ప్రాజెక్టును వేగంగా ముందుకు  తీసుకు వెళ్లవచ్చని ఆయన వివరించారు. దీనిపై కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేసి, జగన్ ప్రతిపాదనకు ఓకే చేశారు. ఇందుకు జగన్ తో పాటు ,మోదీని, నిర్మలా సీతారామన్ ను అభినందించాలి.

✍️ వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఈసారికే పూర్తి కావల్సి ఉంది.  కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇది పూర్తిగా కేంద్ర ప్రాజెక్టు. కానీ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదలుకోవడానికి సిద్దపడి, ప్యాకేజీకి అంగీకరించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలని కోరగా కేంద్రం అంగీకరించింది. అదే ప్రమాదంగా మారింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి, సంబంధిత బిల్లులను పోలవరం ప్రాజెక్టు అధారిటీ ద్వారా కేంద్రానికి పంపి వసూలు చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై ఒత్తిడితో పాటు ,కేంద్రం వేసే కొర్రీల వల్ల సమస్యలు వచ్చేవి.  తానైతేనే ప్రాజెక్టును నిర్మించగలుగుతానని కేంద్రం భావించిందని చంద్రబాబు  గొప్పలు చెప్పేవారు. ఆ తర్వాత అంతవరకు ఉన్న కాంట్రాక్టర్ టాల్ స్ట్రాయును మార్చి నవయుగ కు అప్పగించారు. తదుపరి పలు కాంట్రాక్టు పనులను తమకు కావల్సినవారికి అప్పగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

✍️ ఇక పోలవరం ప్రాజెక్టులో ఏ చిన్నపరిణామం జరిగినా శంకుస్థాపన, ప్రారంభోత్సవం అంటూ హడావుడి చేసేవారు. నిజానికి 2014 లో ఎన్నికలు పూర్తి అయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయిపోయి ఉండేదేమో!. కానీ చంద్రబాబు ఈ ప్రాజెక్టుకన్నా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అధిక శ్రద్ద పెట్టారు.  పోలవరం ప్రాజెక్టుపై ఆ నిధులు వ్యయం చేసి ఉంటే బాగుండేది. కానీ,  ఆయన లక్ష్యం వేరు. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై ఉన్ననమ్మకం తక్కువే. అవి అయితే సత్వరమే పూర్తి కావని , ఎన్నికల టైమ్ లో ఉపయోగం ఉండదని ఆయన భావించేవారు. తర్వాత కాలంలో ఆయన మాట మార్చి పోలవరం తన కల అని కొత్త పాట పాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  పోలవరం ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన చేసిన కృషి వల్లే ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చిందన్నది పచ్చి వాస్తవం.

✍️ 2019లో వైఎస్సార్‌ తనయుడు  వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం వచ్చింది. మధ్యలో రెండేళ్ల కరోనా సంక్షోభం, తదుపరి వరదలు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్ణయాలకు టైమ్ పట్టడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మరికాస్త ఆలస్యం అయింది. స్పిల్ వే, ఎగువ,దిగువ కాఫర్ డామ్ నిర్మాణాలు పూర్తి కావడంతో  , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏడాదిలోగా ఇది తొలి దశను పూర్తి చేసుకుని 41.5 మీటర్ల లెవెల్ లో నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం అన్ని విఘ్నాలు  అధిగమించి ప్రాజెక్టు పురోగమించే ఆశాభావ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పోలవరం వెళ్లి అన్ని పరిస్థితులను స్టడీ చేసి వచ్చారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి అవసరమైన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.

✍️ ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రం ఇలా ఒకేసారి 13 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని ప్రతిపక్ష తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కాని ఊహించి ఉండరు. ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల మేర రెవెన్యూలోటు కింద ఆర్దిక సాయం సాధించిన జగన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం వారికి అర్దంకాని పరిస్థితిగా మారింది. చంద్రబాబు అప్పట్లో నిత్యం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని, రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉందని చెబుతుండేవారు. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, తానే శ్రమిస్తున్నానని కలరింగ్‌ ఇచ్చేవారు. అదే జగన్ అయితే ఈ నాలుగేళ్లలో ఎన్నడూ రాష్ట్రం ఆర్దిక సమస్యలలో ఉందని , అందువల్ల తాను అది చేయలేకపోతున్నా..ఇది చేయలేకపోతున్నా.. అన్నమాటలే చెప్పకుండా తన ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుపోతున్నారు.

ప్రతి దానికి కేంద్రంపై విమర్శలు చేయకుండా.. వారిని ఒప్పించి పనులు చేసుకుంటూ వస్తున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా తగు భూమిక పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో  దీనిని చెడగొట్టడానికి , ఈ ఆర్దిక సాయం పై కూడా వ్యతిరేక కధనాలు రాయడానికి టీడీపీ పత్రికలు  వెనుకాడకపోవడం దురదృష్టకరం.

✍️ కేంద్ర ఉత్తర్వులలో తొలి దశ అని పేర్కొనలేదని, 41.5 మీటర్ల వద్దే  ప్రాజెక్టు నిలిపివేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఈనాడు కధనం ఇస్తే, పోలవరానికి 12 వేల కోట్లే అంటూ ఆంధ్రజ్యోతి వార్త ఇచ్చింది. వారు ఎక్కడ  జగన్ ఈ నిధులను సాధించారని , అది గొప్ప విషయమని రాయని జర్నలిజం వారిది. పైగా స్ట్రక్చర్ తో సంబంధం లేని కట్టకు ఏదో చిన్నసమస్య వచ్చింది. గైడ్ వాల్ అనే  కట్టడం కొంచెం కుంగిందనే కథనాలు ఇచ్చాయి.  ఆ వార్త ఇవ్వడం తప్పుకాదు. కానీ.. అదేదో ప్రాజెక్టు దెబ్బతినిపోయిందేమో అన్న భావన పాఠకులలో కలిగించేలా బ్యానర్ కధనం ఇచ్చారు.

✍️ పోలవరం సందర్శనలో జగన్ కూడా దీని గురించి ప్రస్తావించి చిన్న సమస్యను బూతద్దంలో చూపుతున్నారని అన్నారు. అదే డయాఫ్రమ్ వాల్ కూలిన విషయంలో మాత్రం కాఫర్ డామ్ లో గ్యాప్ లు ఉంచిన గత ప్రభుత్వ నిర్వాకం అని రాయలేదు. దానిని కూడా జగన్ ప్రభుత్వానికి అంటకట్టే యత్నం చేశారు. ఇప్పుడు వారికి అసలు కడుపు నొప్పి వచ్చి ఉండాలి. జగన్ కోరిన వెంటనే ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టుకు పదమూడు వేల కోట్లు ఇవ్వడం వారికి షాకింగ్ గా ఉంటుంది.అందుకే ఇక ఎన్ని వ్యతిరేక కథనాలు రాస్తారో చూడాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు ఫలానా పనికే ఖర్చు చేయాలని నిబంధన పెట్టకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వెచ్చించడానికి వీలుగా కేంద్రం ఆదేశాలు ఇవ్వడం మరింత వెసులుబాటు వస్తుంది. ఈ ఏడాది కాలం చాలా క్రూషియల్ అని చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 41.15 మీటర్ల లెవెల్ లో నీటిని నిలబెట్టగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ఆ స్థాయి వరకు పునరావాస చర్యలకు కూడా ప్రభుత్వం పూనుకుంటుంది. తదుపరి క్రమేపీ నీటి మట్టం పెంచుకుంటూ వెళతామని ప్రభుత్వం చెబుతున్నా, ఎల్లో మీడియా మాత్రం అది జరగదేమో అన్న అనుమానం కలిగించాలని యత్నించింది.

✍️ కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదని డాంబికంగా చెప్పారు.2018 నాటికే పూర్తి అవుతుందని అధికారంలో ఉన్నప్పుడు అనేవారు. మరి ఏమైంది! ఆయన హయాంలో ఎన్నడైనా ఈ స్థాయిలో నిధులు వచ్చాయా?కరోనా, వరదలు వంటివాటిని కూడా ఆపి ఆయన ప్రాజెక్టు పూర్తి చేసేవారా? కబుర్లు చెప్పడం తేలిక. పని జరిగినా, జరగకపోయినా జయము,జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడం అలవాటైతే ఇలాగే మాట్లాడతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టు తొలి దశను విజయవంతంగా పూర్తి చేసి,తనకు, ఈ ప్రాజెక్టు కోసం విశేష కృషి చేసిన తన తండ్రి రాజశేఖరరెడ్డికి మంచి పేరు తెస్తారని ఆశిద్దాం.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top