రజనీ పార్టీ ‘మక్కల్‌ సేవై కట్చి’ ! 

Rajinikanth Political Party Name And Party Symbol Revealed - Sakshi

పార్టీ చిహ్నంగా ఆటోరిక్షా 

ఎన్నికల కమిషన్‌ జాబితాతో వెల్లడి 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పేరు ‘మక్కల్‌ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) అని తెలుస్తోంది. ఈ నెలాఖరులో పార్టీ, చిహ్నం వెల్లడి, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన అంటూ ఇటీవల ఆయన వెల్లడించారు. రజనీ మక్కల్‌ మన్రం నిర్వాహకులు ఢిల్లీలోని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయం(సీఈసీ)లో పార్టీ పేరు, చిహ్నంపై రెండు వారాల క్రితం దరఖాస్తు చేశారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కొత్తగా నమోదైన 9 పార్టీల పేర్లు, వాటికి కేటాయించిన చిహ్నాలను ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసిన జాబితా మంగళవారం బహిర్గతమైంది. ఆ జాబితాలో 8వ స్థానంలో మక్కల్‌ సేవై కట్చి పేరు, ఆటో చిహ్నం ఉంది.

చెన్నై శివారు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్నావూర్‌ బాలాజీ నగర్‌ను పార్టీ ప్రధాన కేంద్రంగా ఈసీ వద్ద రిజిస్టర్‌ చేయడంతో ఇది రజనీ పార్టీనేనా అనే అనుమానాలు తలెత్తాయి. ఈసీకి సమర్పించిన పత్రాల్లో నిర్వాహకుడు రజనీకాంత్‌ అని ఉండడంతో అది రజనీ పార్టీనేనని మంగళవారం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ చిహ్నంగా ఆటోరిక్షాగా కేటాయింపు జరిగింది. ‘బాబా’ చిత్రంలో రజనీ తరచూ చూపించే అరచేతివేళ్లను, సైకిల్‌ను చిహ్నంగా ఇచ్చేందుకు ఈసీ నిరాకరించినట్లు సమాచారం. దీన్ని రజనీ సహా ఎవ్వరూ ధ్రువీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. పార్టీ అధిష్టానం ప్రకటించేవరకు పేరు, చిహ్నంపై మక్కల్‌ మన్రం నిర్వాహకులు స్పందించరాదని పార్టీ నేతలు ప్రకటన విడుదల చేశారు.  

రజనీతో కలిసి పనిచేయడానికి సిద్ధం
రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌హాసన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తమిళనాడులోని కోవిల్‌ పట్టిలో మీడియా ప్రశ్నలకు కమల్‌ సమాధానాలు ఇచ్చారు. అనేక కారణాలతో ఎందరో రాజకీయ పార్టీలు పెడుతున్నట్టు గుర్తు చేశారు. తాను మాత్రం తమిళనాట మార్పు నినాదంతో రాజకీయాల్లోకి వచ్చానని, రజనీ కూడా అదే నినాదంతో వస్తున్నట్టుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి, ఇగోలను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధం అనిప్రకటించారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top