నేను అలా చేయలేను.. వరుణ్‌ గాంధీపై రాహుల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Rahul Gandhi Interesting Comments On Cousin Varun Gandhi - Sakshi

కాంగ్రెస్‌ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లో భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుండగా.. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇద్దరి ఐడియాలజీలు వేరని స్పష్టం చేశారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసుకు వెళ్లేలోపే తల నరికేసుకుంటానని సంచలన కామెంట్స్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ.. మంగళవారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జ‌రిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ వ‌రుణ్ గాంధీ భావ‌జాలంతో తాను ఏకీభ‌వించ‌లేన‌న్నారు. వరుణ్‌ గాంధీ ప్రస్తుతం బీజేపీ తరుఫున లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అందుకే అతని భావాజాలంతో నేను ఏకీభవించలేను. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ ఆఫీసుకు వెళ్ల‌డానికి ముందే త‌న త‌ల‌ న‌రుక్కోవాల్సి ఉంటుంద‌ని రాహుల్ స్పష్టం చేశారు. 

ఇదే క్రమంలో రాహుల్‌ గాంధీ.. ‘మా కుటుంబానికి ఒక ఐడియాల‌జీ ఉంది. కానీ వ‌రుణ్ గాంధీ మ‌రో భావజాలాన్ని స్వీక‌రించారు. నేను వరుణ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోగలను.. ప్రేమతో మాట్లాడగలను. కానీ.. అత‌ను పుచ్చుకున్న ఐడియాల‌జీని తాను స్వీక‌రించ‌లేన‌’ని తెలిపారు.  ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రలో వరుణ్‌ గాంధీ పాల్గొంటారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కామెంట్స్‌ ఆసకిక్తరంగా మారాయి. ఇక, వరుణ్‌ గాంధీ.. ఆయన తల్లి మేనకా గాంధీ కూడా బీజేపీలో ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. 

మరోవైపు.. గతకొద్దిరోజులుగా వరుణ్‌ గాంధీ బీజేపీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిరుద్యోగంపై కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచారు. దీంతో​, వరుణ్‌ గాంధీ వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని వీడే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top