వైఎస్‌ కుటుంబానికి రక్తపు మరకలు అంటించే కుట్ర

Rachamallu Sivaprasad Reddy Fires On Chandrababu - Sakshi

చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజం

ఎంపీ అవినాష్‌రెడ్డిని వివేకా హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు

ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఏబీఎన్, టీవీ5 చానళ్లు, ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్‌ కుటుంబంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేరం చేశాడనే రీతిలో ఏబీఎన్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. అవినాష్‌ని నిందితుడిగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారని అన్నారు.

నాలుగు నెలల క్రితమే తాను ఈ విషయాన్ని చెప్పానని, అదే ప్రకారం అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఈ హత్యతో సంబంధం ఉండదని విశ్వసించాను కాబట్టే తనతో పాటు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని ప్రకటించానన్నారు. ఎంపీపై నేరం రుజువైతే చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారినే క్షమించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురద చల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. తనపై కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుకోలేదని, అలాంటి కుటుంబంలో పుట్టిన ఎంపీ అవినాష్‌రెడ్డికి హత్యా రాజకీయాలు అంటగట్టాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం ఉన్న వైఎస్‌ కుటుంబానికి ప్రజా సేవలో తరించాలనే తపన తప్ప మరొకటి లేదని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top