పంజాబ్‌ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్‌ ఓకే

Punjab Governor Approves Special Assembly Session Big Relief To CM - Sakshi

చండీగఢ్‌: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు ఊరట లభించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్‌ ఇచ్చిన గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌.. ఎట్టకేలకు ఓకే చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు ఆప్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వాన్‌. ‘మా వినతికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈనెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.’అని పేర్కొన్నారు. 

అయితే.. ఈ ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియటం లేదని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. సెప్టెంబర్‌ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్థాల కాల్చివేత, విద్యుత్తు రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది. 

బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల మధ్య తమ బల నిరూపణ చేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 22న విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. అయితే.. చివరి క్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరాకరించి.. ఆప్‌కు షాక్‌ ఇచ్చారు గవర్నర్‌ బన్వారి లాల్‌ పురోహిత్‌. దీంతో గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: పంజాబ్‌ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top