తెలుగు రాష్ట్రాల్లో ‘పొలిటికల్‌ ఫీవర్‌’ | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ‘పొలిటికల్‌ ఫీవర్‌’

Published Mon, Mar 15 2021 9:20 AM

Political Fever In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాజకీయ వేడి కొట్టొచి్చనట్టు కనిపించింది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరగడం, ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆదివారమంతా రాజకీయ చర్చే జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సరళిపై చర్చోపచర్చలు జరగ్గా, ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడంతో రెండు రాష్ట్రాల్లోని వైఎస్‌ కుటుంబ అభిమానుల్లో జోష్‌ కనిపించింది. ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేకుండా అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం... తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రత్యేక చర్చకు తావిచ్చింది.  

టీవీలకు అతుక్కుపోయి 
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళుతున్న తీరుపై అన్ని రాజకీయ పారీ్టలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ కనిపించాయి. ఇక సామాన్య ప్రజానీకం టీవీలకు అతుక్కుపోయి పోలింగ్‌ సరళిని గమనిస్తూ.. తమదైన విశ్లేషణ చేశారు. ఉదయం కొంత మందకొడిగా పోలింగ్‌ జరిగినా, ఆ తర్వాత పుంజుకుని గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్‌ అయిన నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపైనా పలు రకాల చర్చలు జరిగాయి.

పెరిగిన పోలింగ్‌శాతం అధికార టీఆర్‌ఎస్‌కు నష్టం చేస్తుందా? లాభం కలిగిస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలు ఏ మేరకు సొమ్ము చేసుకుంటాయి? స్వతంత్ర అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపుతున్నారన్న దానిపై అటు టీవీల్లోనూ, ఇటు బయట విశ్లేషించడం కనిపించింది. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా గమనించారు. ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా ఉండటంతో అక్కడి వైఎస్సార్‌సీపీ పాలన, నవరత్నాల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న తీరు, జగన్‌ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఉన్న విశ్వాసం లాంటి అంశాలపై తెలంగాణ ప్రజానీకం చర్చించుకుంది. మొత్తంమీద రెండు రాష్ట్రాల్లో ఆదివారం పొలిటికల్‌ ఫీవర్‌ స్పష్టంగా కనిపించింది.  

స్థానిక ఎన్నికలను తలపిస్తూ
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు స్థానిక ఎన్నికలను తలపించింది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లాగానే... స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమించారు. వారం రోజుల ముందు నుంచే ఓటర్లతో టచ్‌లో ఉన్న ఆయా పారీ్టల నేతలు ఆదివారం ఉదయం నుంచే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఓటేసేందుకు రావాలని అభ్యరి్థంచారు. ఇక గ్రామాల నుంచి ఓటర్లు మండల కేంద్రాలకు రావాల్సి ఉండటంతో ఉదయం టిఫిన్‌ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు రాజకీయ పారీ్టలు ఏర్పాటు చేయడం గమనార్హం.

పెరిగిన గ్యాస్‌ ధరలకు నిరసనగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మొదలుపెట్టిన గ్యాస్‌దండాలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్‌ తరహాలోనే పలువురు ఓటర్లు గ్యాస్‌ సిలండర్లకు దండాలు పెట్టి, పూజలు చేసి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కేటీఆర్‌కు కౌంటర్‌ అన్నట్లుగా ... తాను నిరుద్యోగికి దండం పెట్టి ఓటు వేయడానికి వెళ్లినట్లు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొనడం గమనార్హం. ఈ ఓట్ల దండాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

Advertisement
Advertisement