పొంగులేటి రూటు ఎటు? అక్కడి నుంచే పోటీ!

Political Analysis On Ponguleti Srinivasa Reddy Party Contest Seat - Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గులాబీ పార్టీకి దూరమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరో మూడు సెగ్మెంట్లకు ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే తాను పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకీ పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు క్లారిటీ ఎప్పడు ఇస్తారు? 

కారు ఎగ్జిట్‌ షేక్‌ హ్యాండ్‌ కోసమా?
తనకు, తన అనుచరులకు సరైన న్యాయం జరగడంలేదని ప్రకటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాన్నాళ్ళ క్రితమే బీఆర్ఎస్‌ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ఆయన అనుచరులు కూడా పొంగులేటి వెంటే నడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

గత ఎనిమిదేళ్ల కాలంగా తనకు, తనను నమ్ముకున్నవారికి గులాబీ పార్టీలో ఎలాంటి గుర్తింపు లభించలేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పొంగులేటికి బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం రివర్స్‌లో కౌంటర్స్‌ ఇస్తున్నారు. జిల్లా అంతటా పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 

రాజకీయ ఆత్మీయ సమ్మేళనాలు
నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు సైతం వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే..ఇందులో ఏడు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి. ఇందులో పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో తన వర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను సైతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

పాలేరు, మధిర, సత్తుపల్లి అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వ్యూహాత్మకంగానే ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఒక పద్దతిగా.. వ్యూహాత్మకంగా పొంగులేటి తన భవిష్యత్ రాజకీయాలను నిర్మించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మూడు సెగ్మెంట్లలో కూడా తన అభ్యర్థులను పొంగులేటి ప్రకటిస్తారని తెలుస్తోంది.

హైదరాబాద్‌కా? ఢిల్లీకా?
ఇంకా జరగాల్సిన మూడు నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాల్లో.. రెండు అత్యంత కీలకం కానున్నాయి. ముందుగా భద్రాచలం ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గంలో సమావేశం పూర్తయ్యాక.. జనరల్ సీట్లైన కొత్తగూడెం...ఆఖరులో ఖమ్మం పట్టణాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తాను అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని పొంగులేటి ఇప్పటికే చెప్పారు.

అయితే ఎక్కడి నుంచి పోటీచేస్తారో కొత్తగూడెం, ఖమ్మం సమావేశాల్లో ప్రకటించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో ఆఖరుగా నిర్వహించే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బహుశా ఖమ్మం నుంచే పొంగులేటి పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఖమ్మం అదొక మిస్టరీ
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక్కటే గులాబీ పార్టీకి కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఒక్కో సీటు మాత్రమే బీఆర్ఎస్‌కు దక్కంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తనకు బీఆర్ఎస్‌లో భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి వచ్చాకే పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.

తనతోపాటు బీఆర్ఎస్‌లో చేరినవారంతా ఇప్పుడు పొంగులేటి వెంటే ఉన్నారు. వారినే వివిధ సెగ్మెంట్లలో అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఆత్మీయ సమ్మేళనాలన్నీ పూర్తి చేసి..తాను చేరబోయే పార్టీపై కూడా స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. పోటీ చేయబోయే స్థానం, చేరబోయే పార్టీ పేరు ప్రకటిస్తే ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతాయని టాక్ నడుస్తోంది. 
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top