
మూడు వేల మందికిపైగా పోలీసుల మోహరింపు. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపల. వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు. ఆఖరికి.. ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత రెండు రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకుని జగన్ కోసం జనప్రవాహం ఇవాళ తరలి వచ్చింది.

వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి జగన్ పర్యటనను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జగన్ పర్యటన వైపే రావొద్దంటూ హెచ్చరికలూ జారీ చేశారు.




తమ బలం, బలగంతో వైఎస్సార్‌సీపీ నేతలనైతే ఆపగలిగారు. కానీ.. జన ప్రభంజనాన్ని మాత్రం ఏ పోలీసు చట్టం ఆపలేకపోయింది. జగన్ రాకతో గురువారం ఉదయం నెల్లూరు రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకుని.. జగన్ కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానుల జేజేలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకున్నారాయన. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. ‘‘మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ వచ్చిన ఆ జన సునామీని ఆపడం పోలీసుల వల్ల కాలేకపోయింది.


ఇదీ చదవండి: పులివెందుల ఎమ్మెల్యే కాదు.. సింహం