అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుంటాం

Peddireddy Ramachandra Reddy Comments On TDP - Sakshi

విజయవాడలో నాలుగైదు డివిజన్లకే టీడీపీ పరిమితం: మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా సీఎం వైఎస్‌ జగన్‌ సుపరిపాలనకు మద్దతు పలికి 80 శాతానికి పైగా గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలను వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టబోతున్నారన్నారు. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో టీడీపీ నాలుగైదు డివిజన్లలో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. 

కుప్పం దెబ్బకు బాబు చిన్న మెదడు చితికింది: కొడాలి 
కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిందని, పప్పుగా పేరొందిన లోకేశ్‌కు మతి తప్పిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. బాలకృష్ణకు రాష్ట్రంలో పరిస్థితులు తెలియవని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవడం తప్ప ఏమీ చేయలేడన్నారు. 

చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యేలు
చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని ఎమ్మెల్యే జోగి రమేష్‌ విమర్శించారు. టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బీజేపీ నేత సోము వీర్రాజు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అతని కథ ఎక్కువైందని, కాస్త తగ్గించుకుంటే ఆరోగ్యకరమని సూచించారు. చంద్రబాబు తామిచ్చిన ఇళ్ల స్థలాల గురించి మాట్లాడే ముందు తానేం చేసాడో గుర్తుంచుకోవాలన్నారు. బాబు ఒక ఫెయిల్యూర్‌ సీఎం అని, టిడ్కో ఇళ్లను చూస్తేనే ఆయన ఫెయిల్యూర్‌ అర్థం అవుతుందని తెలిపారు. 

సమష్టిగా ముందుకు సాగాలి: సజ్జల, పెద్దిరెడ్డి
అంతకుముందు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కృష్ణా జిల్లా మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నాయకులంతా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ సమష్టిగా ప్రచారంలో దూసుకుపోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వారికి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో వెలంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వల్లభనేని వంశీ, నాయకులు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు, పడమట సురేష్‌బాబు, బొప్పన భవకుమార్, పండుగాయల రత్నాకర్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top