
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సుశీల్‌కుమార్ గుప్తా, సందీప్‌కుమార్ పాఠక్, స్వతంత్ర సభ్యుడు అజిత్‌కుమార్ భూయాన్‌ను ఈ వారమంతా బహిష్కరించారు.
సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేసినందుకు గాను ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలంటూ గురువారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 23కు చేరుకుంది.