వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?

Parkash Singh Badal SAD Nominee From Lambi, Oldest Contestant in India - Sakshi

చండీగఢ్‌:  శిరోమణి అకాలీదళ్‌ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ అరుదైన ఘనత సాధించారు. మన దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ‍త్యంత పెద్ద వయసు గల నాయకుడిగా ఆయన రికార్డుకెక్కారు. పంజాబ్ లోని లాంబి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఐదు పర్యాయాలు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్‌  94 ఏళ్ల వయసులో తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ పేరిట ఉండేది. 2016 ఎన్నికల్లో  92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు. 

75 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు ఇవి 13వ అసెంబ్లీ ఎన్నికలు. చిన్న వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆయన అనేక ఘనతలు సాధించారు. 1947లో బాదల్ గ్రామం నుంచి ఎన్నికైనప్పుడు ఆయన అతి పిన్న వయస్కుడైన సర్పంచ్. అంతేకాకుండా 1970లో అత్యంత పిన్న వయస్కుడైన సీఎం అయ్యారు. 2012లో అత్యంత వయోవృద్ధుడైన సీఎం అయ్యారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా సొంతం. 1970-71, 1977-80, 1997-2002, 2007-12, 2012-17 మధ్య కాలంలో పంజాబ్ సీఎంగా సేవలు అందించారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: భగవంత్‌ మాన్‌.. ఆప్‌ బూస్టర్‌ షాట్‌)

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒకసారి మాత్రమే స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు బాదల్‌. 1967లో గిద్దర్‌బాహాలో హర్‌చరణ్ సింగ్ బ్రార్ చేతిలో కేవలం 57 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాదల్‌ తొలిసారిగా 1957లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మలౌట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత వరుసగా ఐదుసార్లు గిద్దర్‌బాహా నుంచి విజయయాత్ర సాగించారు. అనంతరం లాంబి నియోజకవర్గం ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి అతిపెద్ద అభ్యర్థిగా బరిలో నిలిచారు. (చదవండి: పంజాబ్‌ ఎన్నికల్లో అందరిదీ సేఫ్‌ గేమే!..)

ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ తన రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయలేదు. 1962లో ఒకసారి, ఆ తర్వాత 1992లో అకాలీదళ్‌ ఎన్నికల్ని బహిష్కరించినప్పుడు ఆయన పోటీలో లేరు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఔత్సాహిక నాయకులతో ఈసారి బాదల్‌ ముఖాముఖి తలపడుతున్నారు. దివంగత మంత్రి గుర్నామ్‌సింగ్ అబుల్‌ఖురానా కుమారుడు జగ్‌పాల్‌ సింగ్‌ అబుల్‌ఖురానాను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. దివంగత ఎంపీ జగదేవ్ సింగ్ ఖుదియాన్ కుమారుడు గుర్మీత్ సింగ్ ఖుదియాన్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీలో ఉన్నారు. బీజేపీ ముక్త్‌సర్ జిల్లా మాజీ చీఫ్ రాకేష్ ధింగ్రాను పోటీకి నిలబెట్టింది.

ఇంత వయసులోనూ బాదల్‌ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కరోనా బారిన పడటంతో ఆయన ప్రచారానికి బ్రేక్‌ పడింది.  ఒకటి రెండు రోజుల్లో ఆయన తన నియోజకవర్గానికి చేరుకోనున్నారు. బాదల్‌ తరపున బంధువులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భటిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించారు. కాగా, బాదల్‌ 2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో అవార్డును వెనక్కు ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రైతుల మద్దతు తమకే ఉంటుందని అకాలీదళ్‌ భావిస్తోంది. (చదవండి: చన్నీ వర్సెస్​ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top