నవ సంక్షేమంపై ఆశలు రేపిన విజయం

Five States Assembly Elections Gives A hopeful victory over new welfare - Sakshi

దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కుల వివక్షతో కూడినది కాబట్టి గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. ఢిల్లీ తర్వాత పంజాబ్‌ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ‘ఆప్‌’ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ సంపూర్ణ ఇంగ్లిష్‌ మీడియం అమలును ప్రారంభించారు. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం ‘ఆప్‌’ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా చేస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది.

అయిదు రాష్ట్రాల్లో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘన విజయం సాధించడం, 2. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం. పంజాబ్‌ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ఆప్‌ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. స్వాతంత్య్రానంతర పంజాబ్‌లో అటు కాంగ్రెస్, ఇటు శిరోమణి అకాలీదళ్‌ మాత్రమే పాలిస్తూ వచ్చిన పంజాబ్‌లో ఇది సరికొత్త పరిణామమే మరి! ఇందిరాగాంధీ హత్య, తదనంతరం సిక్కులపై దాడుల తర్వాత కూడా పంజాబ్‌ ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్‌ పెద్దగా నష్టపోకుండా తన పట్టును నిలబెట్టుకుంటూ వచ్చింది. మరోవైపున మత ప్రాతిపదికను ఉపయోగిస్తున్నప్పటికీ, మతతత్వాన్ని ప్రేరేపించకుండా మనుగడ సాధిస్తూ వచ్చిన సిక్కు మితవాద పార్టీ అకాలీ దళ్‌ పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. అయితే పంజాబ్‌లో ప్రపంచీకరణ అనంతర సంక్షేమ చర్యలను ఈ రెండు పార్టీలూ ప్రారంభించలేకపోయాయి. సాంప్రదాయికమైన భూస్వామ్య ప్రభువుల నియంత్రణలోనే ఈ రెండు పార్టీలూ కొనసాగుతూ వచ్చాయి.

సంస్కరణలు కీలకం...
పూర్తిగా కొత్త ముఖాలతో ఢిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చిన నాటినుంచి, పేదల అనుకూల సంక్షేమ పథకాలను అది చేపట్టింది. ఆప్‌ చేపట్టిన సంస్కరణల్లో నాలుగు అతి కీలకమైనవి. పాఠశాల విద్యా సంస్కరణ; ఆసుపత్రుల సంస్కరణ, ఆరోగ్య సేవల విస్తరణ; ఢిల్లీ మురికివాడలకు చక్కగా విద్యుత్‌ సరఫరా (ముంబై, కోల్‌కతా తర్వాత మురికివాడలు ఎక్కువగా ఉన్న నగరం ఢిల్లీ); ఢిల్లీ నగరవాసులందరికీ సమృద్ధిగా నీటి సౌకర్యం కల్పించడం. ఆప్‌ ఇతర సంస్కరణలను కూడా మొదలెట్టినప్పటికీ ఈ నాలుగు సంస్కరణలూ కీలకమైనవని నా అభిప్రాయం.

గత అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ, భావజాలపరమైన ప్రయోగాల నడుమనే జీవిస్తూ వచ్చిన మనకు,  ఈ రెండు పార్టీలూ విద్యా, ఆరోగ్య సంస్కరణలను నత్తనడకతో మొదలెట్టాయని తెలుసు. ఈ రెండు పార్టీలూ ప్రజల డిమాండ్‌ మేరకు కొన్ని సంస్కరణలను తీసుకురాగా, మరికొన్నింటిని ఎన్నికల పోటీలో భాగంగా తీసుకొచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రధానంగా అమలవుతూ వచ్చిన ఈ సంస్కరణ పథకాలు దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలైన తర్వాత మాత్రమే వేగం పుంజుకున్నాయి. ఉత్తర భారతదేశంలో 1960లలోనే చరణ్‌ సింగ్‌ భారతీయ క్రాంతి దళ్‌తో ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వచ్చినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో సోషలిజం సిద్ధాంత భూమికగా కలిగివున్న సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. అయితే ఈ రెండు పార్టీలూ సంక్షేమ హామీల కంటే దిగువ కులాల ఆత్మగౌరవ సాధనే ప్రధానంగా పనిచేసేవి. పీడిత కులాల ఆత్మగౌరవ నినాదం సైతం ఈ రెండు పార్టీలకు ఎలెక్టోరల్‌ భూమికను సృష్టించాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన విద్యా, ఆరోగ్య సంస్కరణలను ఇవి కూడా ప్రారంభించలేకపోయాయి. తర్వాత వచ్చిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ సైతం ఎలాంటి ప్రాథమిక సంస్కరణలనూ మొదలెట్టలేకపోయింది. ఈ పార్టీ కూడా దళితుల ఆత్మగౌరవ నినాదాన్నీ, చారిత్రక ప్రతీకలనూ ప్రోత్సహిస్తూ రావడం ద్వారానే మనగలుగుతూ వచ్చింది.

నాణ్యమైన విద్య మౌలిక అవసరం
భారతీయ గ్రామీణ ప్రజారాశులకు కావలసింది– పల్లెల్లో, పట్టణాల్లో ఉంటున్న పాఠశాలల్లో బాల్యం నుంచే చక్కటి విద్య అందుబాటులోకి రావడమే! తమ గ్రామ పరిధిలోనే 1 నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలందరూ నాణ్యమైన విద్యను పొందగల గాలి. దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి అవసరం. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కులపరమైన వివక్షతో కూడిన దేశం కాబట్టి ప్రధానంగా విద్యలో, గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. భారతీయ ప్రజాస్వామ్యం ఎదుగుతున్నందున... భాషా సమానత్వం, మౌలిక వసతుల కల్పన నిత్యం జరగడం వంటివి పాలకవర్గాల ప్రాథమ్యంగా ఉండాలి. కానీ దీర్ఘకాలంగా ఉనికిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గానీ, బీజేపీ గానీ మొదటి నుంచీ ప్రైవేట్‌ రంగంలో ఇంగ్లిష్‌ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా విద్యను ఆయా రాష్ట్రాల్లో అమలు పరుస్తూ వచ్చాయి. 

ప్రైవేట్‌ రంగం వ్యూహాత్మకంగా కులీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అనుమతిస్తుండగా, గ్రామీణ పిల్లలు అత్యంత పేలవమైన వాతావరణంలో ప్రాంతీయ భాషా విద్యకు పరిమితం అయిపోతూ వచ్చారు. కమ్యూనిస్టు విద్యావిధానంలో గానీ, ఉదారవాద విద్యా విధానంలో గానీ పేదలకు తమ ప్రాంతీయ భాషా పరిధిలోనే నాణ్యమైన విద్యను అందించడం గురించి గొప్పగా చెబుతూవచ్చాయి. అయితే నాణ్యమైన విద్యను ఉమ్మడి మీడియంతో కలిపి మనదేశంలో ఎన్నడూ చూడలేదు. దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్య గురించి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిని ఏ పార్టీ కానీ మేధావి వర్గం కానీ అధిగమించలేకపోయాయి. 

1956లో భాషా ప్రాతిపదికన తెలుగు భాషా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా ప్రాంతాలకు సంబంధించిన మనోభావాలు పెరుగుతూ వచ్చాయి. 1960లు, 70లలో దేశంలో పలు భాషా ప్రాతిపదిక ఉద్యమాలు చెలరేగాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్‌ విద్యలో రాష్ట్ర భాషపై దృష్టి పెట్టాయి. కానీ ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను సమతౌల్యం చేయడంపై ఇవి ఎలాంటి దృష్టీ పెట్టలేదు. ఇక పాఠశాల మౌలిక వ్యవస్థకు ఇవి ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు.

నమూనా అధ్యయనం చేయాలి
2019లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ మిగతా సబ్జెక్టుల్లో సంపూర్ణ ఇంగ్లిష్‌ మీడియం అమలును ప్రారంభించారు. అలాగే పాఠశాల మౌలిక అవసరాల కల్పనకు ఆయన కీలక ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారు. పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లి ఖాతాకు 15 వేల రూపాయలను ‘అమ్మ ఒడి’ పేరుతో ఇస్తూ వచ్చారు. తెలం గాణలో కూడా ఇదే విద్యా నమూనాను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. పంజాబ్‌ ప్రభుత్వం కూడా ఏపీ నమూనాను అధ్యయనం చేసి అమలు చేస్తుందని ఆశిద్దాం.

కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో ఆప్‌ ప్రభుత్వం ఢిల్లీలో ఆసుపత్రుల మెరుగుదల, క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుని ఆరోగ్య సమస్యను పరిష్కరించింది. అలాగే ఢిల్లీలో నీరు, విద్యుత్‌ సరఫరా గణనీయంగా మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయనప్పటికీ ఆప్‌ ప్రభుత్వం  ఇన్ని మార్పులు తీసుకురాగలిగింది.

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం విద్యా, ఆరోగ్య సంస్కరణల ఎజెండాను తీసుకున్నట్లయితే, దేశవ్యాప్తంగా అది గొప్ప ప్రభావం కలిగిస్తుంది. పంజాబ్‌ లాంటి రాష్ట్రంలో చాలామంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వలస వెళ్లడం తెలిసిందే. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ఆప్‌ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా తీసుకొస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది.

వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top