నవ్వు తెప్పిస్తున్న నాయకుల తీరు.. మీ సెప్టిక్ ట్యాంక్‌ నిండిందా? అనే రాతలకు చోటు లేకుండా పాయే!

Old Is Gold Poltical Leaders Campaign With Wall Paintings Nalgonda Viral - Sakshi

కొత్తొక వింత..పాతొక రోత.. అనే సామెత పాతపడిపోయింది. ఇప్పుడు పాత దాన్నే సరికొత్తగా బయటికి తీస్తోంది నేటి తరం. కొందరు ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తుంటే..మరికొందరు దాన్ని ఫాలో అవుతుంటారు. రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారానికి సరికొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. పాతవాటినే కొత్తగా వాడుతున్నారు. నల్గొండ జిల్లాలో పాత ప్రచార విధానమే లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. అదేంటో చదవండి.

గోడలపై ప్రచారం
తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. రోజువారి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏం చేస్తే ఓటర్లు తమవైపు చూస్తారో అని పొలిటికల్ మైండ్స్‌ తెగ ఆలోచిస్తున్నాయట నల్లగొండ జిల్లాలో. ఆ క్రమంలోనే కనుమరుగైన ఒకనాటి ప్రచార ఆయుధాన్ని తెరపైకి తీసుకొచ్చారట. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అయినా... ఏదైనా పార్టీ బహిరంగ సభ జరిగితే వాల్ రైటింగ్స్‌ను విపరీతంగా రాయించేవారు. టెక్నాలజీ పెరుగుతుండటంతో గోడ రాతలు చాలా కాలం క్రితమే కనుమరుగయ్యాయి. దీంతో ఎందరో పెయింటర్స్‌ ఉపాధి కోల్పోయారు. చాలా కాలం తర్వాత రాజకీయ నేతల కారణంగా మరోసారి బ్రష్‌లను చేతపట్టుకున్నారట గోడల మీద రాయగలిగే పెయింటర్స్. 

వాల్.. సవాల్‌
ఎన్నికలు వచ్చినపుడు వివిధ పార్టీల అభ్యర్థులు సాధారణంగా గోడ మీద రాతలతో తమ ప్రచారం చేసుకునేవారు. గోడల్ని ముందుగానే రిజర్వ్ చేసుకునేవారు. కాని నల్గొండ జిల్లాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికలకు ఇంకా 8 మాసాల టైమ్ ఉండటంతో అభ్యర్థులు కావాలనుకుంటున్నవారు గోడలకెక్కుతున్నారు. టికెట్ ఆశించే నేతలు నీ పెతాపమో..నా పెతాపమో గోడల మీద చూసుకుందాం రా అని సవాళ్ళు విసురుకుంటున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వాల్ రైటింగ్సే దర్శనం ఇస్తున్నాయి. 

ఒకే పార్టీకి చెందిన నేతలే పోటాపోటీగా గోడ రాతలు రాయిస్తున్నారట. బీఆర్ఎస్‌కు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి...అదే పార్టీ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు యాదవ్... ఇంకొకరు చాడా కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ ముగ్గురు నేతల రాతలే తీవ్ర చర్చనీయాంశం అయ్యాయట నల్లగొండ సెగ్మెంట్‌లో. అక్కడా.. ఇక్కడా కాదు పాడుబడిన బంగ్లాల గోడలపై కూడా గృహప్రవేశం చేసేవారిలా సున్నాలు వేసి రంగులతో రాయిస్తున్నారు. నాయకుల ప్రచారయావ జనానికి నవ్వు తెప్పిస్తున్నా... రాత్రిళ్లు అటు చూడాలంటేనే భయం వేసేలా ఉండే పాడుబడిన భవనాల గోడలు సున్నాలతో మెరుస్తుండటంతో సంతోష పడుతున్నారట. 

రాజకీయం.. రంగుల మయం
తెల్లవారక ముందే పెయింటర్స్‌ కలర్ డబ్బాలతో రాతలు రాసేందుకు ఖాళీగా ఉన్న గోడల ముందు వాలిపోతున్నారట. నేతల పోటాపోటీతో...ఇంతకుముందు.. మీ సెప్టిక్ ట్యాంక్‌ నిండిందా..ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి అని కనిపించే ప్రకటనలకు చోటు లేకుండా పోయిందట. ఇదే సమయంలో పోస్టర్లు, ఫ్లెక్సీలతోనూ నేతలు చిన్నసైజు యుద్ధమే చేస్తున్నారట. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పిల్లి రామరాజు, బీజేపీ నేత నాగం వర్షిత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారట. 

కంచర్ల భూపాల్ రెడ్డి ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధికి సంబంధించిన పోస్టర్లను అతికిస్తుండగా ఆయనకు పోటీ నేతగా ప్రచారంలో ఉన్న పిల్లి రామరాజు కూడా వేలాదిగా పోస్టర్లను అతికిస్తున్నారట. నల్లగొండ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న నాగం వర్షిత్ రెడ్డి కూడా ప్రధాన సర్కిల్స్‌లో భారీగా ఫెక్సీలను ఏర్పాటు చేస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. అధికార పార్టీకి ధీటుగా వర్షిత్‌రెడ్డి కూడా ప్రజల్ని ఆకర్షించేందుకు ఫెక్సీ వార్‌కు దిగడంతో రాజకీయం రంజుగా మారింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు జనాలను ఆకర్షించేందుకు పాత, కొత్త పద్ధతులను ఎంచుకోవడంతో పెయింటర్స్‌తో పాటు ప్రింటిగ్ ప్రెస్ వారికి ఉపాధి దొరుకుతోంది. రాజకీయ నాయకుల ప్రచారం కోసం సాగుతున్న గోడ రాతల యుద్ధం శ్రుతి మించకుండా ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top