టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలోకి గులాబీ నేతలు‌!

Nizamabad Rural Constituency TRS Leaders Joins BJP - Sakshi

డిచ్‌పల్లి ఎంపీపీ సహా పది మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు

కాషాయ పార్టీలో జోష్‌

డిచ్‌పల్లి: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ‘కారు’ దిగి, కాషాయం గూటికి చేరారు. డిచ్‌పల్లి ఎంపీపీ సహా పది మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాగా మాజీ జెడ్పీటీసీ కులాచారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. డిచ్‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, వైస్‌ ఎంపీపీ శ్యాంరావుతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు శనివారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆ పార్టీ నాయకుల సూచన మేరకు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇక డిచ్‌పల్లి మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉండగా, ఇందులో ఎంపీపీ సహా ఏడుగురు ప్రస్తుతం కాషాయ గూటికి చేరారు. త్వరలోనే మిగతా వారు కూడా వస్తారని వారు చెబుతున్నారు. (చదవండి: కేటీఆర్‌ సమర్థుడైతే.. కేసీఆర్‌ అసమర్థుడా?)

బీజేపీతోనే అభివృద్ధి.. 
ఈ సందర్భంగా కులాచారి దినేశ్‌కుమార్, ఎంపీపీ గద్దె భూమన్న మాట్లాడుతూ.. రాబోయే కాలంలో రూరల్‌ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారిలో సర్పంచులు కులాచారి సతీశ్‌కుమార్, శివారెడ్డి, రూప సతీశ్‌రెడ్డి, వినోద సదానంద్, బసునూరి ఆనంద సిద్దిరాములు, ఖతిజ యూసుఫ్, ప్రమీల గంగారాం, బి.నర్సయ్య, లత నర్సింగ్‌రావు, విజయ శశాంక్‌రెడ్డి, ఎంపీటీసీలు దండుగుల సాయిలు, బుక్యానాయక్, ఎంబడి సంతోషం, మంజుల గణేశ్, మానస సాయి, సౌమ్య సుదీర్‌తో పాటు ఉప సర్పంచులు, పార్టీ నాయకులున్నారు.

కాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి, అనతి కాలంలోనే జిల్లా స్థాయి నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్న దినేశ్‌కుమార్‌.. తన అనుచరులైన ఎంపీపీ, వైఎస్‌ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి బీజేపీలో చేరడం అధికార పార్టీకి షాక్‌ తగిలినట్లయింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top