
గాజువాకలో రోడ్‌షో నిర్వహిస్తున్న లోకేశ్
భీమిలి.. విశాఖ నగరంలో విలీనమైన సంగతి కూడా ఆయనకు తెలియకపోవడం గమనార్హం. దక్షిణ నియోజకవర్గంలో మాట్లాడుతూ ప్రశాంత నగరంలో గడ్డాలు పెంచుతూ ఒక రౌడీ తిరుగుతున్నారన్నారు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తనదైనశైలిలో చేసిన అసంబద్ధ ప్రసంగాలు నగర ప్రజలను విస్మయానికి గురిచేశాయి. 1978లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారని లోకేశ్ వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న టీడీపీ నేతలు 1998 అని చెప్పడంతో.. ఆయన సర్దుకున్నారు. సీఎం జగన్ పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ప్రజలను విస్మయానికి గురిచేశాయి.
మంత్రిగా వ్యవహరించిన లోకేశ్‌కు చమురు ధరలు ఎవరు పెంచుతారో తెలీదా? అంటూ వారు వ్యాఖ్యానించారు. భీమిలిలో ప్రసంగిస్తూ మూడోవార్డు అభ్యర్థిని గెలిపిస్తే.. మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారు. భీమిలి.. విశాఖ నగరంలో విలీనమైన సంగతి కూడా ఆయనకు తెలియకపోవడం గమనార్హం. దక్షిణ నియోజకవర్గంలో మాట్లాడుతూ ప్రశాంత నగరంలో గడ్డాలు పెంచుతూ ఒక రౌడీ తిరుగుతున్నారన్నారు. రోడ్ షో అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. విశాఖ నగరానికి 16 నెలలుగా ఏమీ చేయలేనివారు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌తో ఏం పీకుతారంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. లోకేశ్ తొలుత సింహాచలం లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అంతంతమాత్రంగా వచ్చిన జనాన్నే అన్ని డివిజన్లకు తరలించేందుకు నేతలు అష్టకష్టాలు పడ్డారు.