‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’ | Mlc Varudu Kalyani Fires On Home Minister Vangalapudi Anitha | Sakshi
Sakshi News home page

‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’

Jun 16 2026 9:30 PM | Updated on Jun 16 2026 9:33 PM

Mlc Varudu Kalyani Fires On Home Minister Vangalapudi Anitha

సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్‌గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్‌'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్‌మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.

దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.

కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతం
సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.

మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.

కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్
హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.

ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:
కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"

గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..
మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. 

ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.

పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలు
హోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? 

మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై  అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు.  ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు.  సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?

ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్‌ను హోటల్‌లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?

సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.

లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి.  కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.

హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement