ఎమ్మెల్సీ పోలింగ్‌ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ పోలింగ్‌ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Published Tue, May 28 2024 5:11 AM

సిద్దిపేట జిల్లా చేర్యాలలో రిక్షాలో వచ్చి ఓటేసిన దివ్యాంగురాలు రాజేశ్వరి

ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌

ములుగు జిల్లాలో అత్యధికంగా 74.54 శాతం.. ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా 65.54 శాతం

జూన్‌ 5న కౌంటింగ్‌ 

3 రోజులపాటు కొనసాగే అవకాశం  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్‌ పేపర్‌కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్‌ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గతంలో కంటే తగ్గిన పోలింగ్‌
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం కంటే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్‌ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్‌ హౌజింగ్‌ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నా
పోలింగ్‌ సందర్భంగా నార్కట్‌పల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్‌ హాల్‌ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్‌ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్‌ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్‌లోని జడ్పీ హైస్కూల్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్‌ చైర్‌ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.

ప్రశాంతంగా పోలింగ్‌ : రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement