జల ప్రళయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలా!

Minister Anil Kumar Yadav on Union Minister Gajendrasingh Shekhawat - Sakshi

కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యం

నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: జల ప్రళయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హితవు పలికారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ అనిల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్ల సామర్థ్యానికి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందన్నారు. ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగితే, అక్కడ 150 మంది జల సమాధి అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి నిజాల్ని దాచే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఆ వాదన సరికాదు
అన్నమయ్య ప్రాజెక్టులో ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి బయటకు వెళ్లే నీటి సామర్థ్యం 40 వేల క్యూసెక్కులేనని మంత్రి పేర్కొన్నారు. విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే ఉండటంతో ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదన్నారు. ఈ అంశం స్పష్టంగా తెలిసినప్పటికీ షెకావత్‌  ఈ విషయంలో నిజాలు విస్మరించారన్నారు.

షెకావత్‌ వెనుక కూర్చున్న సీఎం రమేష్, సుజనాచౌదరి బహుశా కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ తరఫున ఈ పిట్ట కథ వినిపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏం జరిగిందన్న విషయంపై జిల్లా కలెక్టర్‌ లేదా ప్రాజెక్టు అధికారులతో సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అత్యంత సున్నితమైన అంశాలను సాక్షాత్తు పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించాలన్నారు. నిరాధారమైన ఈ వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ చేస్తున్న యాగీ చూస్తుంటే జల ప్రళయంలో కూడా ఇంత దిగజారి రాజకీయం చేస్తారా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top