బీజేపీపై ఉమ్మడి పోరు 

Mamata Banerjee Writes To Opposition CMs To Resist BJP Intention Of Misusing Central Agencies - Sakshi

బీజేపీయేతర సీఎంలకు మమత లేఖ 

కాంగ్రెస్, ఇతర విపక్షాలకు కూడా 

అరాచక పాలనను అంతం చేద్దాం 

త్వరలో భేటీకి ప్రతిపాదన 

కోల్‌కతా: బీజేపీ అరాచక పాలనపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరముందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ అన్నారు. ఇందుకు కలిసి రావాలంటూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, విపక్ష పార్టీల నేతలకు మంగళవారం ఆమె లేఖలు రాశారు. తాను కొంతకాలంగా ఒంటికాలిపై లేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి  లేఖ రాయడం విశేషం. బీజేపీపై పోరాటానికి వ్యూహం, విధివిధానాల రూపకల్పనకు త్వరలో సమావేశం అవుదామని మమత సూచించారు.

రాజకీయ ప్రత్యర్థులపై, గిట్టని వారిపై ఈడీ, సీబీఐ, విజిలెన్స్‌ దాడులతో ప్రజాస్వామ్యాన్నే బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రత్యర్థి పార్టీలపైకి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పడం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అలవాటుగా మారింది. వాటి డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు పొడిగించుకునేందుకు ఉద్దేశించిన ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ బిల్లు, సీవీసీ (సవరణ) బిల్లులను విపక్ష సభ్యులు లేకుండానే పార్లమెంటులో ఆమోదించుకున్నారు.

ఇది సుప్రీంకోర్టు తీర్పులకు పూర్తిగా విరుద్ధం. పైగా న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూడా పాడుజేయజూస్తోంది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండి తీరాలి. వాటికి పాతరేసి కేవలం విపక్షాలనే లక్ష్యం చేసుకుంటున్న వైనం కళ్లముందు కన్పిస్తోంది. బీజేపీ కక్షపూరిత రాజకీయాలను ఇక ఎంతమాత్రమూ సహించొద్దు. దాని అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడుదాం. బీజేపీని ఇంటికి పంపి దేశంలో ఆదర్శ పాలనకు బాటలు పరుద్దాం. ఇందుకోసం మనమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముంది. విధి విధానాలపై చర్చించుకునేందుకు అందరికీ అనువైన చోట సమావేశమవుదాం’ అని లేఖలో మమత పేర్కొన్నారు. 

పెదవి విరిచిన కాంగ్రెస్‌ 
మమత లేఖపై బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా పెదవి విరవడం విశేషం. జాతీయ స్థాయికి ఎదగాలన్న మమత ఆశలు ఇప్పటికే అడియాసలయ్యాయని బీజేపీ ఎద్దేవా చేసింది. 2014, 2019ల్లో కూడా ఆమె ఇలాగే మాట్లాడినా గోవా, త్రిపురతో సహా అన్నిచోట్లా ఎన్నికల్లో మట్టికరవడంతో తత్వం బోధపడిందని బెంగాల్‌ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య అన్నారు. బీజేపీపై పోరాటంలో మమతకు విశ్వసనీయత లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అబ్దుల్‌ మన్నన్‌ అన్నారు. 

మమతకు పవార్‌ మద్దతు 
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న మోదీ సర్కార్‌పై మమతా బెనర్జీ చేపడుతున్న పోరులో కలిసి నడుస్తామని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. ‘ ఈ విషయాన్ని బుధవారం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం. ఉమ్మడి కార్యాచరణపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై త్వరలో పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తాం’ అని పవార్‌ అన్నారు.

‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. తమ సిద్ధాంతాన్ని పంచుకోని వారందరినీ శత్రువులుగా చూస్తోంది. అందుకే ఇలా విపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ దాడులతో ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్‌సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్, నవాబ్‌ మాలిక్‌లపై దాడులనుద్దేశిస్తూ పవార్‌ మాట్లాడారు. ‘మోదీ మదిలో ఒక్కటే ఉంది. ప్రజామోదంతో సంబంధం లేకుండా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశాన్నంతా బీజేపీనే పాలించాలని ఆయన భావిస్తున్నారు. కశ్మీర్‌ పండిట్లపై అకృత్యాలు.. గత కాలపు పాత గాయాలను మాన్పాల్సిందిపోయి ది కశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలను ప్రోత్సహిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పవార్‌ ధ్వజమెత్తారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top