నారా భువనేశ్వరి కొత్త రాగం.. టెన్షన్‌లో ఎల్లో బ్యాచ్‌!

KSR Comments Over Chandrababu CID Investigation In Skill Scam - Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఐడీ అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారా!. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి  వంటి పత్రికలు అలా రాసేసరికి అది నిజమా అన్న సందేహం వచ్చింది. ఒకరకంగా  ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. మామూలుగానే ఆయన దేనికి సూటిగా జవాబు ఇవ్వరు కదా!అలాంటిది అంత  పెద్ద దర్యాప్తు సంస్థకు స్పష్టంగా జవాబు ఇవ్వడమా అనిపించింది.అక్కడితో  ఆగలేదు.. ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు.. ఫైళ్లు చూసుకుంటున్నారు. నన్ను తప్పు పట్టడానికి మీ వద్ద ఆధారం ఏమీ లేదు అని చంద్రబాబు డబాయించి మాట్లాడారని కూడా ఈ మీడియా తెగ సంబరపడుతూ కధనాలు ప్రచారం చేసింది. 

వారి ప్రచారం చూస్తే  చంద్రబాబును సిఐడి ప్రశ్నించిందా? లేక చంద్రబాబే సిఐడిని  ప్రశ్నించారా? అన్న అనుమానం వస్తుంది. తాను ఇంకా ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నట్లుగా ఫీల్ అయి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారేమో అనిపిస్తుంది. ఆయన అలా చేశారో లేదో కాని, చంద్రబాబు జైలులో ఉన్నప్పటికీ ఏమీ భయపడడం లేదని పిక్చర్ ఇవ్వడానికి ఈ మీడియా చేసిన యత్నమన్న సంగతి ఆ వార్తను మొత్తం చదివిన తర్వాత అర్ధం అయింది. అసలు ఈ విషయాలు వీరికి ఎవరు చెప్పారు? చంద్రబాబు జైలులో ఉన్నారు. సిఐడి వారు వీరికి చెప్పే రిస్కు తీసుకోరు. చంద్రబాబు లాయర్  అక్కడ కాస్త దూరంగా ఉండి విచారణను గమనించారు. గంటకోసారి చంద్రబాబును లాయర్ కలిశారు. వారేమైనా టీడీపీ మీడియాకు చెప్పారా?. ,

నిజంగా అలా జరిగి ఉంటే వేరే విషయం. చంద్రబాబు అసలు సిఐడికి సహకరించలేదని ఇతర మీడియాలలో వార్తలు వచ్చినా పూర్తి వివరాలు మాత్రం సిఐడి వారు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో వెల్లడించారు. అవి చదివితే చంద్రబాబు జైలులో ఉండి కూడా మీడియాను ఇంతగా మేనేజ్ చేయగలుగుతున్నారా అన్న భావన వస్తుంది. లేదా టిడిపి మీడియానే సొంతంగా తన ఊహాగానాలు చేసి ఉండవచ్చు. దానికి కారణం వారి వ్యాపార, రాజకీయ  భవిష్యత్తు అంతా చంద్రబాబులోనే చూసుకుంటున్నందున అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు సీఐడీ కోఆపరేట్ చేయలేదని రాస్తే, సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారన్న సమాచారం బయటకు వస్తే తెలుగుదేశం క్యాడర్ మరింత డీలా పడిపోతుందన్న  భయంతోనే ఆ వర్గం మీడియా ఇలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. 

ఈనాడు, జ్యోతి చెప్పినవన్ని కట్టు కథలే అని సిఐడి తేల్చేసింది. అదేమిటంటే  చంద్రబాబు తనను కస్టడీకి ఇస్తూ కోర్టు ఇచ్చిన  తీర్పు కాపీని చదవడానికే కొన్ని గంటలు తీసుకున్నారట. నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణం కేసులో చంద్రబాబును విచారించడానికి సిఐడి సుమారు 120 ప్రశ్నలు సిద్దం చేసుకుని వస్తే అందులో ముప్పై శాతం ప్రశ్నలు కూడా రాకుండా చేయడంలో చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. పైగా తనపై  వచ్చిన ఆరోపణలకు సంబందించిన ఆధారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారట. ఇదంతా వింటుంటే ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాదిరి మరే నిందితుడు అయినా ఇలా  చేస్తే పోలీసులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. వారిలో కోపం కట్టలు తెంచుకుంటుందని అంతా అనుకుంటారు. 

అలాంటిది చంద్రబాబు పెద్ద నాయకుడు, ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేత కనుక చాలా ఓపికగా సిఐడి వ్యవహరించిందని అనుకోవాలి. దీనిని అడ్వాంటేజ్ చేసుకుని విచారణకు సహకరించకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఇలాంటి స్కామ్ ల కేసుల్లో ఒక కొత్త అధ్యాయమేనేమో తెలియదు. బహుశా ఆయనకు ఎవరైనా లాయర్ ఇలా తర్ఫీదు ఇచ్చారా?. లేక ఆయన తన సొంత ఆలోచనల మేరకే సిఐడిని ఇబ్బంది పెట్టి కేసు నుంచి బయటపడాలని అనుకున్నారో తెలియదు. కానీ, ఆరితేరిన స్కామ్‌స్టర్ మాదిరి ఆయన ప్రవర్తించారని మాత్రం కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీయడం ద్వారా సిఐడి వారు పరిస్థితిని కోర్టువారి దృష్టికి తీసుకువెళ్లారు. 

ఈ మధ్యే ఒక కేసులో నిందితుడిని విచారించే దర్యాప్తు సంస్థ వీడియో తీయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కానీ, ఇక్కడ మాత్రం కోర్టువారు వీడియో తీయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇది కూడా మంచిదే. లేకుంటే తనను వేధించారని  చంద్రబాబు ఆరోపించే అవకాశం ఉండేది.  ఆయన తరపు లాయర్లు, వారి మీడియా  ఆ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. తద్వారా ప్రజలలో ఎంతో కొంత సానుభూతి పొందాలని యత్నం చేసేవారు. కస్టడీ ముగిసిన సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం సమాధానం ఇస్తూ, తనను కక్ష  పూరితంగా అరెస్టు చేశారని చెప్పారు. తనపై ఆధారాలు లేవని   అన్నప్పుడు న్యాయమూర్తి ప్రాధమిక ఆధారాలు ఉన్నందునే రిమాండ్ కు పంపించామని చెప్పడమే కాకుండా  చాలా విస్పష్టంగా 600 డాక్యుమెంట్ ద్వారా దర్యాప్తు  సంస్థ చంద్రబాబు పాత్రను తెలియచేసిందని వివరించారు. 

స్కిల్ స్కాంలో కొందరి పేర్లను ప్రస్తావించినప్పుడు చంద్రబాబు చిర్రుబుర్రులాడారట. ప్రత్యేకించి గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ తదితర పేర్లు చెప్పి వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలపై సిఐడి సమాచారం రాబట్టడానికి యత్నించగా, చంద్రబాబు తీవ్ర అసహనం చెందారట. దీనిని బట్టే ఆయనకు ఈ స్కామ్ తో పూర్తి  సంబంధం ఉందన్న అనుమానం బలపడుతుంది. అదే వారి గురించి చంద్రబాబు సహనంతో చెప్పి ఉంటే సిఐడికి సందేహం తగ్గేదేమో. అలా చేయకపోగా వారిపైనే అరిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. పెండ్యాల శ్రీనివాస్ సిఐడి నోటీసులు అందుకున్న వెంటనే అమెరికా పారిపోవడంలోని ఆంతర్యం కూడా చంద్రబాబు చెప్పలేరు. మరి కొన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తూ  అన్నిటిని ముఖ్యమంత్రి పర్యవేక్షించరని, అధికారులు చూసుకుంటారని చెప్పి ఆయా శాఖలపై నెట్టి  తప్పించుకోచూశారు. 

అదే సమయంలో ఒకరిద్దరు అధికారులను ఎందుకు విచారించడం లేదని ఆయన ఎదురుదాడి చేశారు.నిజానికి ఏ నిందితుడు అయినా వివిధ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇచ్చేలా సిఐడి ప్లాన్ చేసుకుంటుంది. నిందితులు తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడం సహజమే. కాని అప్పుడే దర్యాప్తు అధికారులు తమ చాకచక్యం ప్రదర్శించి నిజాలు రాబట్టవలసి ఉంటుంది. కాని, చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా తన హోదాను  వినియోగించినట్లు అనిపిస్తుంది. ఫలితంంగా సిఐడి అధికారులు కూడా కాస్త నెమ్మదిగానే ఈ విచారణ కధను నడిపిసట్లు అర్ధం అవుతుంది. దీనివల్ల చంద్రబాబుకు రాజకీయంగా అయితే  బాగా నష్టమే జరుగుతుంది. నిజంగా చంద్రబాబుకు ఈ స్కామ్ లో లబ్ది జరగకుండా ఉంటే ధైర్యంగా సిఐడి అడిగేవాటికి జవాబు ఇచ్చేవారు. అలా చేయలేకపోవడంతో తెలుగుదేశం క్యాడర్ లో నైరాశ్యం ఏర్పడుతుంది. ఇంతకాలం తాను నిప్పు అని చంద్రబాబు ప్రచారం చేసుకునేవారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను ఎవరికి దొరకనని అంటుండేవారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నాలుగేళ్లలో తనను ఏమీ చేయలేదని అనేవారు. ఇప్పుడు అన్నింటికి ఆయనకు సమాధానం దొరికినట్లయింది. దాంతో ఆయన ఏమి చేయాలో దిక్కుతోచక సిఐడి వారు అడిగిన ప్రశ్నలకు అబద్దాలతో సరిపెట్టడానికి యత్నిస్తున్నారనిపిస్తుంది. వీటన్నిటిని తెలుసుకుంటున్న టిడిపి కార్యకర్తలు బాగా డీలా పడుతున్నారు. ఒక వైపు చంద్రబాబు జైలులో ఇలా కథ నడుపుతుంటే, ఆయనపై కేసులు మీద కేసులు వచ్చి పడుతుంటే, మరో వైపు ఆయన కుమారుడు లోకేష్ ఏపీ నుంచి వెళ్లిపోయి ఢిల్లీలో బస చేసి అక్కడ నుంచి ప్రకటనలు ఇస్తున్న తీరు  టిడిపిని మరింత గందరగోళంలో పడేస్తుంది. 

పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించుకున్నా అందులో పెద్ద నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణిలు చిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. వారిద్దరు టిడిపిని కాపాడాలని ఆ పార్టీ క్యాడర్ కన్నా టిడిపి  టివీలలో చర్చలు నిర్వహిస్తున్న యాంకర్లు తెగ రోధిస్తూ ప్రాధేయపడుతుండడం హైలైట్ గా ఉంది. అందులో భాగమో ఏమో కాని, భువనేశ్వరి జగ్గంపేట నిరసన దీక్ష సభలో పాల్గొని చంద్రబాబుకు అవినీతి చేయవలసిన అవసరం లేదని, హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని ప్రకటించారు. దాంతో సోషల్ మీడియాలో ఆమె కూడా చంద్రబాబు మాదిరే అబద్దాలు చెబుతున్నారంటూ వ్యంగ్యవ్యాఖ్యానాలు వచ్చాయి. 

బ్రాహ్మణికి కూడా రాజకీయంగా అంత అనుభవం లేదు. అందుకే ఆమె చిన్నపిల్లల మాదిరి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ల కన్నా  ఈ ఇద్దరు  మహిళలే పార్టీకి ఉపయోగపడతారన్న అభిప్రాయం కలిగిందో, మరేదో కాని, టిడిపి మీడియా వీరిద్దరికి ఊదరగొడుతూ ప్రజలలో  కృత్రిమ సానుభూతి తేవడానికి నానా పాట్లు పడుతోంది. అదే టైంలో సోషల్ మీడియాలో  చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్‌ చేసిన దూషణల వీడియోకి కూడా ప్రాముఖ్యత వస్తోంది. తాము ఎన్టీఆర్‌ను అనుసరిస్తున్నామని భువనేశ్వరి అన్న మాటలకు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చంద్రబాబును ఆయన అవినీతిపరుడని, ద్రోహి అని రకరకాల మాటలు అన్నారుగా అన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని చెప్పాలి.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top