ప్రతి టూర్‌లో ఓ సీన్‌.. ప్రతి సీన్‌కు ఓ ట్రోల్‌! | KSR Comments: Chandrababus Gimmick Politics Amid Social Media Trolls | Sakshi
Sakshi News home page

ప్రతి టూర్‌లో ఓ సీన్‌.. ప్రతి సీన్‌కు ఓ ట్రోల్‌!

May 27 2026 1:06 PM | Updated on May 27 2026 1:25 PM

KSR Comments: Chandrababus Gimmick Politics Amid Social Media Trolls

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల ​కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. 

‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. 

స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు  చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్‌తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ  లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన  సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే,  మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న  చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 

2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు  లేదు. చేసిన వాగ్దానాలను అమలు  చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్‌లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు  కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్‌లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. 

ఈ వయసులో ఇన్ని విన్యాసాలు  అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక  ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు  ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్‌కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు  ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు  ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు  బాధపడుతున్నారు. 

గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు  సూపర్ హిట్‌ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే  ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. 

చంద్రబాబు నాయుడు  1995లో  ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక  తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో  టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్‌ల గానే మారిపోయాయి. కావలి వద్ద  ఉన్న జువ్వలదిన్నె  సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు  వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు  నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర  అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్‌ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర  ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. 

ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  మత్సకార  వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ  ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే,  బోటు  మనదే,  వేట మనదే అంటూ పంచ్  డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు.  ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు  ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.

1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన  రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా  రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement