తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

Kishan Reddy Land Allegations Against Telangana Government - Sakshi

సాక్షి, వికారాబాద్‌: కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్‌ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

​కాగా, కిషన్‌ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ధరణితో లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టల్‌ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్‌గా ప్రకటించడం వల్ల చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్య పరిష్​కారమవుతుందనేది తెలియడంలేదు

గతంలో గతంలో కొన్ని భూ సంబంధిత సమస్యలు ఉంటే ధరణి పోర్టల్ వల్ల ఇవి భారీగా పెరిగిపోయాయి. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అది ప్రగతిభవన్ నుంచే చేపట్టాలి. సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్​కారమయ్యేవి.. కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా?. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములకు విక్రయాలు చేపడుతున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్ లు సామాన్యులకు చేరడం లేదు. వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు

బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్‌ ఉందని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. రైతులు తమ సమస్యలు పరిష్​కరించాలని అందించిన దరఖాస్తులు ఏమయ్యాయి?
ధరణి బాగానే ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లు కేసీఆర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బయటపెట్టాలి. ధరణిలో భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో బయటపెట్టండి. ప్రగతిభవన్‌లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను అమలుచేస్తున్నారు తప్ప.. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదు. 

ఒవైసీ గతంలోనే చెప్పాడు.. కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని చెప్పాడు. రాజాసింగ్ సెక్రటేరియట్‌కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు?. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు అనుమతిలేదు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారినే లోనికి పంపించడం లేదు. పాతబస్తీలోకి ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి కానీ ధైర్యంగా వెళ్​లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోంది. తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. హైదరాబాద్‌లో రూ.కోట్లతో కట్టిన కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏం చేస్తోంది. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇ‍వ్వాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top