సోమవారం రాత్రి జగిత్యాలలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్
రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్విర్మాణ యజ్ఞం..
పొదరిల్లు లాంటి రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా?
ఈ వెధవలు చావాలని అనుకుంటే నేను చస్తానా?
కాంగ్రెస్ దోపిడీతో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు
పనిచేయని వారిని లాగులు పగిలేదాకా సంపాలి
కేసీఆర్ సభలు పెడితేనే రైతుబంధు కిస్తీ ఇస్తారా?
అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా రద్దు చేస్తాం
జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి
ప్రజలకు మంచి జరగాలనే బయటకు రాలేదు
జగిత్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా..? నువ్వు వేయి జన్మలెత్తినా చావను.. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా..? ఈ వెధవలు చావాలని అనుకుంటే చస్తానా? మీ ఆశీర్వాదాలు ఉంటే అన్ని వర్గాల ప్రజలు గర్వంగా, సంతోషంగా ఉండేలా, అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా. చివరి శ్వాస దాకా 50 ఏండ్ల వారిలా నేనూ, జీవన్‌రెడ్డి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతాం. రాష్ట్రం ఎందుకు బాగుపడదో చూస్తాం‘ అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. జగిత్యాలలో సోమవారం బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన కేసీఆర్ గంట పాటు ప్రసంగించారు.
‘తెచ్చిన తెలంగాణలో మంచి, చెడు చూసే బాధ్యత నాకు అప్పగిస్తే కొత్త కుండలో ఈగ చొచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన లేకున్నా నిపుణుల సహాయంతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశాం. కానీ కేసీఆర్‌కు పాలన చేతకావడం లేదు... మాకు పాలనలో అనుభవం ఉంది. ఆరు చందమామలు, ఏడు సూర్యులను పెడతామని అధికారంలోకి వచ్చి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అందువల్ల ప్రజలు సంఘటితమై తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలు పెట్టాలి. గ్రహచారం బాగాలేదని కూర్చుంటే దెబ్బతింటాం. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభిస్తున్నా.. ముందుకెళ్లి విజయం సాధిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 
మూడో కిస్తీ కోసం మరో సభ పెట్టాలా...
‘ఉత్తి మాటలు.. గప్పాలు కొట్టుడు కాదు.. మిషన్ భగీరథ ఐదేండ్లలో పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని నిండు అసెంబ్లీలో చెప్పిన సీఎంను ఎవరైనా చూశారా? మరిప్పడు ఏం రోగం వచ్చింది. పని చేయని వారిని లాగులు పగిలేదాకా సంపాలి. పొదరిల్లు లాంటి తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని ఏడు వేల మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి క్షణం కూడా కరెంటు పోకుండా చేశాం. మరిప్పుడు ఏం బీమారి వచ్చింది. రైతుబంధు కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి. జగిత్యాలలో సభ పెడితే రైతుబంధు రెండో కిస్తీ ఇస్తున్నారు. మూడో కిస్తీ కోసం కేసీఆర్ మరో సభ పెట్టాలా. రైతుబంధు వేసేందుకు కాటారంలో సభ పెట్టారు. రెండు నెలలకోమారు ఎకరానికి ఆరు వేలు వేసి సిపాయిల్లా డప్పు కొట్టుకుంటున్నరు’ అని కేసీఆర్ అన్నారు.
..అందుకే బయటకు రాలేదు
‘బీఆర్‌ఎస్ పాలనలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేస్తారో లేదో కూడా చెప్పడం లేదు. ఉద్యోగులకు 72శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇస్తే ఈ ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల బకాయిలతోపాటు కనీసం ఏడు శాతం జీతం కూడా పెంచలేదు. ఉచిత బస్సుతో ఆటో కార్మీకులు ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ తిరగేస్తే సింగరేణి, పౌరసరఫరాలు సహా అనేక కుంభకోణాలు, భూ కబ్జాలు జరుగుతున్న తీరు చూస్తే బాధ కలుగుతోంది. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, అరెస్టుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకున్నా నేను ఒకటి రెండుమార్లు తప్ప బయటకు రాలేదు. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చారు. మంచి జరగాలని కోరుకున్నా.. కానీ ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం, గొప్ప స్కీమ్ లేదు. అందుకే జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు ‘‘కాంగ్రెస్ పోవాలే.. బీఆర్‌ఎస్ రావాలే అంటున్నడు’’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 
మొదటి సంతకంతోనే హైడ్రా రద్దు
‘మేము మూడున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే హైడ్రాతో పిల్లలు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు చేస్తున్నరు. హైడ్రాను జిల్లాల్లో కూడా తెస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం’ అని కేసీఆర్ మండిపడ్డారు.
జీవన్‌రెడ్డి.. నేను దగ్గరి మిత్రులం
‘జీవన్‌రెడ్డి గురించి ఎక్కువ చెప్తే మాది మేము డబ్బా కొట్టుకున్నట్లు అయితది. 45 ఏండ్ల నుంచి దగ్గరి మిత్రులం అయినా భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశాం. కానీ మంచి చెడ్డలు, కష్టసుఖాలు, అభిప్రాయాలు కలిసి పంచుకునే వాళ్లం. జగిత్యాల ప్రాంతం గురించి ప్రాణం పెట్టి పనిచేసిన నాయకుడు జీవన్‌రెడ్డి. నేను సీఎం అయిన తరువాత కరీంనగర్‌లో సభ పెడితే అక్కడికి వచ్చి బోర్నపల్లి బ్రిడ్జి అవసరం అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడిగారు. వెంటనే రూ. 80 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించిన. ఇటీవల కొన్ని సర్వేలు జరిగితే బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరిక ఆటంబాంబుగా పేలడంతోపాటు జగిత్యాలతోపాటు పొరుగు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తేలింది. నేనూ, జీవన్‌రెడ్డి అన్నదమ్ముల్లా, పారీ్టకి పిల్లర్లుగా పనిచేస్తాం. ఆయన జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లాలకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలన్నీ చూసుకోవాలి. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచే అపాయింట్ చేస్తున్నా. ఆరు నూరైనా.. వచ్చేసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇది నామాట. జగిత్యాల యుద్ధం కార్యకర్తల వంతు. తెలంగాణ యుద్ధం మా వంతు’ అని కేసీఆర్ ప్రకటించారు.
అలిశెట్టి కవితతో ప్రారంభం
జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ కవితతో కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ’చీకట్లో దడుసుకుంటే.. ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై బయపెడుతది.. గుండెంటూ ఉంటే ... అదే నీకు సైన్యం అయి నిలుస్తది’ అన్నారు. ఈ సభకు వచ్చిన మీరు, రోడ్ల మీద అశేషంగా నిలిచిన జీవన్‌రెడ్డి అభిమానుల ఆశీర్వాదంతో నాకు గుండె ధైర్యం వచ్చింది. జీవన్‌రెడ్డి అన్నకు, ఆయన వెంట వచ్చిన వారికి బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా స్వాగతం’ అంటూ కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.
⇒ ’బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం. మూసీ ప్రాజెక్టుతో వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం సహా ప్రాజెక్టులను పండబెట్టి అబద్దాలు ఆడుతున్నారు’
⇒ ‘కాంగ్రెస్ మాటలు కోటలు దాటాయి. కాకికి పెడదామంటే కుష్కడు లేవు... పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దోపిడీతో ఎవరూ సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు’
⇒ ‘దరిద్రులకు రాజ్యం అప్పజెప్తే రైతుల పొలాలు ఎండుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య. రైతు బంధుకు రాం..రాం.. దళితబంధుకు జై భీమ్ అంటరని, మోసపోతే గోస పడతామని ఎన్నికకు ముందు చెప్తే నా మాటను కొందరు వినలేదు’


