ఢిల్లీ నుంచి నేరుగా క్యాంపునకు వెళ్లిన మంత్రి గంగుల!

Karimnagar MLC Polls: Rebel Ravinder Singh Are Determined To Fight It - Sakshi

 అసంతృప్తుల మద్దతు కూడగడుతున్న నేతలు

ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు మిగిలింది కొన్ని గంటలే

మాజీ మేయర్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్, పోటీలోనే ప్రభాకర్‌రెడ్డి..

వేములవాడలో రవీందర్‌సింగ్‌ రహస్య మంతనాలు

ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే యోచన

సాక్షి, కరీంనగర్‌: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో ఎక్కడికి వెళ్లారన్నది అంతుపట్టని విషయంగా మారింది. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి గంగుల కమలాకర్‌ రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులుగా భానుప్రసాద్, ఎల్‌.రమణ బరిలో ఉన్నా.. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించ భంగపడ్డ నేత కావడంతో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది.
చదవండి: ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం

ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో రవీందర్‌సింగ్‌ తెరవెనుక మంతనాలు సాగిస్తున్న విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం పలువురు అసంతృప్త, బరిలో నిలిచిన నేతలు, వారి మద్దతుదారులతో రవీందర్‌సింగ్‌ రహస్యంగా సమావేశమయ్యారు. వేములవాడలో కొందరు నేతలతో రహస్యంగా నిర్వహించిన సమావేశం తాలూకు ఫొటోలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక సిరిసిల్లలో మాదాసి వేణు నామినేషన్‌ ఆమోదం పొందింది. ఈయన కూడా ఎంపీటీసీల ఆత్మగౌరవం నినాదంతోనే ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు.
చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌

ఎన్నికై మూడేళ్లవుతున్నా.. పైసా విదల్చని పదవులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన పలువురు నేతలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. వేణును బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ఎంపీటీసీల గౌరవ అధ్యక్షుడు నగేశ్‌ యాదవ్‌ వీడియో వైరల్‌గా మారింది. అధికారాలు లేని తమ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని లేదా తమకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఉమ్మడి అభ్యర్థి కోసం యత్నాలు..!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ఇండిపెండెంట్లు, రెబెల్స్‌ అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెబెల్స్‌ మంతనాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో విడిపోయి పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని రవీందర్‌సింగ్‌ వేములవాడలో పలువురు అసంతృప్త నేతలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. శిబిరాన్ని సందర్శించిన మంత్రి హైదరాబాద్‌ వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడిది శామీర్‌పేటలోని ఓ రీసార్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ సందర్శించారని తెలిసింది. 

ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారని.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. మరోవైపు శిబిరాల్లో ఉన్న నేతలు తమకే ఓటు వేస్తారా? లేక ఎదురు తిరుగుతారా? అన్న భయం గులాబీ సీనియర్‌ నేతలను వెంటాడుతోంది. ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వీరు పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఓటేయకుండా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. బరిలో 24 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ (నామినేషన్ల పరిశీలన) ముగియగా.. ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు బుధవారం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రకటించారు.

కరీంనగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, వాటిలో నుంచి శ్రీకాంత్‌ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్‌ రెడ్డి నామినేషన్లు తిరస్కణకు గురైనట్లు చెప్పారు. బరిలో 24 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉందని వివరించారు.

ఓటు మాదే.. సీటు మాదే..
ఎంపీటీసీల ఆత్మగౌరవం నిలిపేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో నిలిచానని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు న్యాయంగా రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఖజానాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన తాము.. వారికి ఏ పనీ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, పూర్వపు అధికార వైభవం తీసుకొచ్చేందుకు తాను పోటీ చేసి తీరుతానని తెలిపారు. తమ ఓట్లతో పారిశ్రామిక వేత్తలకు సీట్లు ఎలా ఇస్తారని నిలదీశారు.

సీనరేజీ గ్రాంట్లు, వెహికిల్స్‌ అలవెన్స్, ఈజీఎస్‌ ఫండ్స్, స్టాంప్‌ డ్యూటీల ద్వారా వచ్చే నిధులను తమకు రాకుండా మళ్లించడం ఎంత మేరకు న్యాయమని, తమ గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ ఆత్మగౌరవం నిలవాలంటే తామే బరిలో ఉంటామని, ఓటు మాదే–సీటు మాదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top