Jupally Krishna Rao: మల్లేష్‌ బీజేపీ సానుభూతిపరుడు.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Jupally Krishna Rao Political Counter To KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్‌ అయ్యారు. సంక్రాంతి రోజున కేటీఆర్‌ కారణంగా ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్‌కు జూపల్లి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి జూపల్లి సోమవారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది డిసెంబర్‌లో కొల్లాపూర్‌లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు?. హంతకులను శిక్షిస్తామని మేము ముందే చెప్పాము. ఈ కేసుకు సంబంధించి కొందరు పోలీసుల అదుపులో ఉన్నారు. 

రాజకీయాలు వద్దు..
మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఆయనను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్‌లపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలను కలుషితం చేస్తున్నారు.  1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కొండగట్టు మరణాల సంగతేంటీ?
ఇదే సమయంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్యపై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి ఫిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్‌లో ఉన్న పెద్దలకు చెప్పినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్మల్ని జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top