ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?

High Court Verdict On Avinash Anticipatory Bail Petition Is Lesson For Media - Sakshi

కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్‌ లక్ష్మీణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక గుణపాఠం అని చెప్పాలి. జస్టిస్‌ను ఈ సందర్భంగా అభినందించాలి. అవినాష్‌కు బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ఇష్యూ. తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియచెప్పారని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం. అలాగనీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు.

జనాన్ని నమ్మించాలని చూశారు.. కానీ..
అందులో  తప్పుఒప్పుల గురించి మాట్లాడుకోరాదని కాదు. కాని గౌరవ న్యాయమూర్తిపై దురుద్దేశాలు ఆపాదించకూడదు. అభియోగాలు చేయరాదు. అవినాష్‌ రెడ్డిని సీబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఏకంగా అవినాశ్ ను హెలికాప్టర్‌లో ఈ మీడియా తరలించేసింది. ఈ మీడియా సీఆర్ పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది. అవినాష్‌ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఏమి జరుగుతుందో శోధించడానికి వీరు చేయని అకృత్యాలు లేవు. ఇంకేముంది అవినాశ్ అరెస్టు ఖాయం అని వారు నమ్మారో లేదో కాని, జనాన్ని నమ్మించాలని చూశారు. కాని వారు అనుకున్నదానికి రివర్స్‌లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై దాడికి దిగారు.

అలా చేయకుండా.. అదేదో..
ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్‌ను కూర్చోబెట్టి చండాలపు ఆరోపణలు చేయించారు. ఆ టివీలో చర్చ చూస్తే అదంతా మాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయించినట్లు కనిపిస్తుంది. నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత చానల్ వారు వెంటనే నిలుపుదల చేయడం, క్షమాపణ చెప్పించడం, తాము కూడా క్షమాపణ చెప్పడం చేయాలి. అలా చేయకుండా, అదేదో తమ చానల్‌కు సంబంధం లేని వ్యవహారంగా వదలివేశారు. చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్లాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో, వాటిని ప్రచారం చేయడం కూడా అంతే తప్పు అవుతుంది.

ఎవరూ చట్టానికి అతీతులు కారు..
కాని గత నాలుగేళ్లుగా న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయాయి. తాము ఏమి చేసినా ఎదురులేదన్న చందంగా మారాయి. తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్నవారితో పరిచయం ఉందన్న అతిశయంతో వారు చెలరేగిపోయారు. నిజానికి ఈ మీడియావారికి పరిచయం ఉన్నంతమాత్రాన గౌరవ జడ్జిలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఉంటారు?. మార్గదర్శి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణే అవుతుంది. ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటిని సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ఎవరూ చట్టానికి అతీతులు కారని తేల్చింది.

ఆ టీవీ సైలెంట్ అయిపోయింది..
గతంలో ఒక కేసులో కొందరికి జైలు శిక్ష పడింది. అలా శిక్ష పడినవారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయాధికారిపై ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ముందు మాట్లాడారు. ఆ టీవీవారు తెలిసో, తెలియకో ఒకటికి రెండుసార్లు ప్రసారం చేశారు. దాంతో ఆ న్యాయాధికారి ఆ టీవీవారికి, ఆరోపణ చేసిన మహిళకు నోటీసు జారీ చేసి కేసు చేపట్టారు. ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది. ఈ నాలుగేళ్లలో ఏపీలో న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు. ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం, వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం, ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలని యత్నించారు. ఇటీవల ఏపీ నుంచి సుప్రీంకోర్టు జ్జడి అయిన ఛీప్ జస్టిస్ పి.కె.మిశ్ర ఈ పరిణామాలపై విసుగు చెందారు.

సీబీఐ డొల్లతనం.. ప్రశ్నల రూపంలో
అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా? వద్దా? ప్రతిదానికి పిల్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా సీబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి, లేనివి రాయడం అలవాటు చేసుకున్నారు. ఆ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పుచేతలలో ఉన్నట్లుగా ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను కూడా అలాగే లొంగదీసుకోవాలని యత్నించి విఫలం అయింది. గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్‌లు చేశారు. కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాశ్‌కు ఏమీ పూర్తి స్థాయి రిలీఫ్ ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప, ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేయదలిస్తే ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు.

మరికొన్ని కండిషన్‌లు పెట్టారు. అదే టైమ్‌లో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్, మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని ఛీఫ్ జస్టిస్‌కు నివేదించారు. ఇంత బేలెన్స్‌డ్‌గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి విశిష్టత అని చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్, మహా టీవీల వారికి వెంటనే నోటీసు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కాని ఈ సందర్భంగా ఆయన కలత పడిన తీరును వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ ఎల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది.

ఒక చిన్న లాజిక్.. చాలా పెద్ద విషయం..
అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసులలో ఇంతగా పరిశీలించరట. కాని తనపై టీవీలలో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయనకు బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియచెప్పింది. సీబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేటతెల్లమైంది. వైఎస్ వివేకా హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక, ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఏలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైనం గురించి ప్రశ్నించారు.

ఒక జర్నలిస్టు ఆసక్తికర విశ్లేషణ..
వివేకాకు ఇంతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాశ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాశ్ ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లు విచారణ సాగించిందన్న విమర్శలు వచ్చాయి. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్నది వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. గతంలో సీబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలికగా సమాచారం ఎలా వస్తుందా అన్న సంశయం వస్తుంది. ఇంకో విశేషం ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.

టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో.. సీబీఐ కూడా..
టీడీపీ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సీబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడువడం మొదలైన విషయాలలో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు. కాని అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సిందికాదు. వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాశ్ తదితర వ్యక్తులు చెబుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సీబిఐపై ఇంతగా విమర్శలు వచ్చేవి కావు.
చదవండి: Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’

ఇప్పుడు బ్రేక్ పడిందా?
ఈ కేసులో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్ అవడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సీబీఐతో పాటు వివేకా కుమార్తె సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే హత్య జరిగిన తొలి రోజులలో సునీత మాట్లాడిన తీరుకు, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకపోవడం కూడా గమనించదగ్గ సంగతే. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులుపుకోవాలని సీబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు బ్రేక్ పడిందని అనుకోవచ్చు.

నేర్చుకోవలసిన పాఠం ఇదే..
ఈ కేసు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సీబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదన్నది ఒకటైతే, మీడియా తనతోచిన విధంగా, తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవడానికి న్యాయ వ్యవస్థ సిద్దంగా ఉండదని తెలుసుకోవాలి.  జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top