కేరళ డీఎన్‌ఏలోనే ‘జోడో’ సందేశం

Fifth Day Of Bharat Jodo Yatra Rahul Gandhi Praises Kerala State - Sakshi

ఐదో రోజు యాత్రలో రాహుల్‌

తిరువనంతపురం: కేరళ అందరినీ గౌరవిస్తుందని, ప్రజల మధ్య విభజనను, సమాజంలో విద్వేషాల వ్యాప్తిని అనుమతించదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశంసించారు. కేరళ ఆశయాలు, ఆలోచనలకు భారత్‌ జోడో యాత్ర కొనసాగింపు అన్నారు. రాహుల్‌ పాదయాత్ర ఆదివారం ఐదోరోజుకు చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చక్కటి విద్యా విధానం అమలవుతోందని అన్నారు. కరుణామూర్తుల్లాంటి మంచి నర్సులు తయారవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ఉండడం, కలిసి పనిచేయడం కేరళ ప్రజల సహజ గుణమని అన్నారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశానికి తాము ఇవ్వాలనుకుంటున్న సందేశం కొత్తదేమీ కాదని, ఇది  కేరళ డీఎన్‌ఏలోనే ఉందని వివరించారు. తన పాదయాత్రకు మద్దతిస్తున్న కేరళీయులకు రాహుల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.  

చేనేత కార్మికులకు భరోసా
కేరళలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర తొలిరోజు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తిరువనంతపురం జిల్లాలోని పరస్సాలా నుంచి నేమోమ్‌ వరకూ ఆయన యాత్ర సాగింది. పరస్సాలాలో ఉదయం నుంచే కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు రాహుల్‌ రాక కోసం ఎదురు చూశారు. జీఆర్‌ పబ్లిక్‌ çస్కూల్‌లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. బలరాంపురంలో చేనేత కార్మికులతో సంభాషించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని తాను కేవలం చేనేత కార్మికులుగా చూడడం లేదని, మన చారిత్రక, సంప్రదాయ పరిశ్రమను పరిరక్షిస్తున్న కళాకారులుగా భావిస్తున్నానని రాహుల్‌ చెప్పారు. కొత్త డిజైన్లు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించారు. తగిన సాయం అందిస్తానని కార్మికులకు భరోసా కల్పించారు.

ఇదీ చదవండి: Rahul Gandhi: రాహుల్ జీ.. తమిళ అమ్మాయిని చూసిపెడతాం.. పెళ్లి చేసుకోండి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top