ప్రజల ఆ ఒక్క కోరికా తీరుతుందేమో!  | Sakshi
Sakshi News home page

ప్రజల ఆ ఒక్క కోరికా తీరుతుందేమో!

Published Wed, Oct 18 2023 3:15 AM

ex minister jana reddy commented on chief minister post - Sakshi

గుర్రంపోడు (నాగార్జునసాగర్‌): ‘నేను ఏ హోదాలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నట్లుగానే లెక్క.. 55 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నన్ను తెలుగు రాష్ట్రాల్లో అందరూ గౌరవిస్తున్నారు, ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నేను ఆశించకుండానే అనేక పదవులు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రీ చేయని పలు శాఖలకు మంత్రిగా పనిచేశా.. ప్రజల ఆ చివరి కోరిక కూడా నాకు తెలియకుండానే తీరవచ్చు’అని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు.

‘పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను, పదవే రేసులో ఉండి నన్ను వరిస్తుంది’అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా.. ముఖ్యమంత్రి అయినంక, ఆరు నెలల తర్వాత నా కొడుకు రాజీనామా చేస్తాడు.. నేను ఎమ్మెల్యే అవుతా’అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరితా రవికుమార్, పదిమంది సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ, పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో జానారెడ్డి మాట్లాడారు. మరోమారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. సమావేశంలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య తదితరులు పాల్గొన్నారు. 

 
Advertisement
 
Advertisement