
ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశ ఎన్నికల వ్యవస్థ క్రమబద్దీకరణలో భాగంగా గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీలను రిజిస్టర్ పొలిటికల్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను ఈసీ తొలగించింది. రాజకీయ పార్టీలకు వర్తించే ప్రయోజనాలేవీ వర్తించని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఐదు పార్టీలు, తెలంగాణలో 13 పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది.
కాగా, నిబంధనల ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఈసీ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Cleaning up the Electoral System: ECI Delists 334 RUPPs
Read in detail: https://t.co/qlam3VRcBX pic.twitter.com/hbZDF2fnDZ— Election Commission of India (@ECISVEEP) August 9, 2025
పేరుకు మాత్రమే పార్టీలు పెట్టినప్పటికీ.. వీటికి ఎలాంటి కార్యాలయాలు లేవంటూ ఈసీ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అవ్వగా.. తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,520కి తగ్గిపోయింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతుండగా.. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పారదర్శకత పెంచడం.. అవినీతి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం.. దీనిలో భాగంగా నిబంధనలు పాటించని పార్టీలను తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.