బీఆర్ నాయుడు పేలాపనలపై సమాజం గుర్రు
పవన్ ఒత్తిడి, బాబు సలహాతో ఎట్టకేలకు దిగొచ్చిన చైర్మన్
చివరకు ఇష్టం లేకున్నా క్షమాపణ చెప్పిన వైనం
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇంకో నలభైమంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసారు. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నీరుగార్చి చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, ఈవో మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలి అని బాణం సంధించారు. అయితే..
దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తలబిరుసుతో మాట్లాడుతూ.. ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి? అని ప్రశ్నిస్తూనే.. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.
టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను పదే పదే ఆయన్ను సారీ చెప్పడం కోసం డిమాండ్ చేస్తున్నారు. . ఇదంతా ఒకేగానీ పవన్ ఉన్నఫళంగా టీటీడీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నారు?. ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా ?..
మోదీ సభలో ప్రాధాన్యం తగ్గిందా ?
వాస్తవానికి మొన్నటి విశాఖ సభలో ఉంటేగింటే మోదీ తరువాతి ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు .. రెండో స్థానంలో ఉన్న పవన్‌కు దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్‌కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్లో మంత్రిగా ఉన్న లోకేష్‌ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా.. లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటె తనను తొక్కేసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తన సహజశైలిలో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు.
తనను తొక్కేసి లోకేష్‌ను ఎలివేట్ చేసే ప్లాన్లకు తానెందుకు తలొగ్గాలి.. అసలు కూటమి విజయంలో తనదే కీలకపాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.
అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకుని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మున్ముందు పవన్ కల్యాణ్ చంద్రబాబు కాలికింద చెప్పులా ఉంటారా? చెప్పులోని రాయిలా మారతారా? చూడాలి..
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment