చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు

Dominance fight in Chittoor district TDP - Sakshi

తన గెస్ట్‌హౌస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మదనపల్లె ఇన్‌చార్జ్‌ రమేష్‌ 

కబ్జా చేసిన స్థలంలో సమావేశానికి రాలేమని చెప్పి బహిష్కరించిన ఇతర నేతలు 

మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పర్యటనలో బహిర్గతమైంది. మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోవర్గం ప్రకటించింది. ఆదివారం సోమిరెడ్డి, టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి మదనపల్లెకి వచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్‌లోని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ తన గెస్ట్‌హౌస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ గెస్ట్‌హౌస్‌ మాజీ సైనికుల నుంచి కబ్జా చేసిన స్థలం అని దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని, అలాంటి చోట సమావేశాలు నిర్వహిస్తే తాము రాలేమని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు అధినాయకులకు చెప్పారు.

సమావేశాన్ని అక్కడ కాకుండా వేరెక్కడైనా ఏర్పాటు చేస్తే పాల్గొంటామని తెలిపారు. అయితే తన ప్రత్యర్థి వర్గం వాదనలకు విలువివ్వకుండా తన గెస్ట్‌హౌస్‌లోనే రమేష్‌ సమావేశం ఏర్పాటు చేయడంతో శ్రీరామ్‌చినబాబు, బాబురెడ్డి, టౌన్‌బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ విద్యాసాగర్, మైనారిటీ నేతలు మస్తాన్, పఠాన్‌ఖాదర్‌ ఖాన్, దొరస్వామినాయుడు తదితరులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సోమిరెడ్డి హడావుడిగా సమావేశాన్ని ముగించి ప్రత్యర్థి వర్గంతో బుజ్జగింపులు మొదలుపెట్టారు. అవి ఫలించకపోవడంతో ఆయన వెనుదిరిగారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top