
ఖాదీ పునరై్వభవానికి ప్రధాని మోదీ కృషి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
రొహ్‌తక్: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఖాదీ విషయమే మర్చిపోయిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఖాదీని ప్రోత్సహించేందుకు ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఖాదీ అంటే కేవలం డ్రస్ మాత్రమే కాదు, మన స్వదేశీ, ఆత్మనిర్భరతకు చిహా్నలని మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హరియాణాలోని రొహ్‌తక్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు. ‘స్వాతంత్య్రం వచ్చాక చేసిన దానికంటే ఖాదీ అభివృద్ధికి గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. అప్పట్లోనే ఖాదీకి ప్రోత్సాహం ఇచి్చనట్లయితే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేదే కాదని చెప్పారు.
స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో మహాత్మాగాంధీ పేదరికాన్ని పారదోలేందుకు, దేశం స్వయం సమృద్ధం సాధించేందుకు, స్వదేశీ భావనను పెంచేందుకు ఖాదీని ఆయుధంగా వాడుకున్నారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచి్చన ప్రోత్సాహంతో దేశంలో లక్షలాదిమంది నేతగాళ్ల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని, అదేసమయంలో ఆయన ఆధ్వర్యంలో ఉద్యమం బలోపేతమైందని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ మర్చిపోయిన ఖాదీకి తిరిగి వైభవం సాధించేందుకు గుజరాత్‌కు సీఎంగా ఉన్న సమయం నుంచే నరేంద్ర మోదీ కృషి మొదలైందన్నారు. ఫలితంగా 2014–15లో రూ.33 వేల కోట్లుగా ఉన్న ఖాదీ, గ్రామ పరిశ్రమ కమిషన్ (కేవీఐసీ)ల టర్నోవర్ నేడు రూ.1.70 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
11 ఏళ్లలో 70 శాతం పురోగతి
డైరీ రంగం గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ పాలనలో 70 శాతం మేర పురోగతి సాధించిందని అమిత్ షా వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా నిలిచిందని చెప్పారు. పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 6.60 కోట్ల లీటర్ల నుంచి 2028–29 నాటి 10 కోట్ల లీటర్లకు పెంచాలని ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా, 2029 కల్లా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలోనూ సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాదిలోనే 33 వేల సహకార సంఘాలు కొత్తగా నమోదయ్యాయని తెలిపారు.