సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది.


