Sakshi News home page

బీజేపీకి బీఆర్‌ఎస్‌ తాకట్టు: సీఎం రేవంత్‌రెడ్డి

Published Tue, Apr 16 2024 1:03 AM

CM Revanth Reddy Fires On BJP And BRS - Sakshi

బిడ్డకు బెయిల్‌ కోసం కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారు 

నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

5 స్థానాల్లో కాంగ్రెస్‌ను అడ్డుకుని బీజేపీని గెలిపించేందుకు కుతంత్రాలు 

బీజేపీకి ఓట్లేయాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్తున్నారు 

ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు 

అన్ని పార్లమెంట్‌ స్థానాల్లోనూ హస్తం అభ్యర్థులను గెలిపించాలి 

14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రి చేస్తా.. 

ఎస్సీ వర్గీకరణ చట్టం చేసే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకుంటుందని వెల్లడి 

వంద రోజుల్లో చాలా పనులు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నారాయణపేట గడ్డపై నుంచి రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. ఏకకాలంలో, ఏకమొత్తంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది. వడ్లకు కూడా రూ.500 బోనస్‌ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీలు అమల్లోకి తెచ్చాం. రుణమాఫీ కూడా చేసి తీరుతాం.    
– రేవంత్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ‘‘బీఆర్‌ఎస్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారు. కవితకు బెయిల్‌ వచ్చేందుకు కోసమని కాంగ్రెస్‌ను ఓడించేలా చీకటి ఒప్పందం చేసుకున్నారు. మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌ లోక్‌సభ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు సుపారీ తీసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు..’’ అని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ జన జాతర సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘లక్షలాది మంది కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు జైలుకు పోయినా కేసీఆర్‌కు దుఖం రాలేదు. నా బిడ్డ లగ్గం ఉన్నా నన్ను వదలకుండా జైల్లో పెట్టించారు. అప్పుడు కూడా ఆయనకు బాధ కలగలేదు. కానీ ఆయన బిడ్డ జైలుకు పోగానే మోదీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టారు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 

ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని తెలిసి.. 
పాలమూరులో బీజేపీకి ఓట్లు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు సొంత పార్టీ కార్యకర్తలకు చెప్తున్నారు. చేవెళ్లలోనూ బీఆర్‌ఎస్‌ లీడర్లను బీజేపీకి లొంగిపొమ్మంటున్నారు. భువనగిరి, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం.

ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే.. రేవంత్‌ను దెబ్బతీయొచ్చనే ఆలోచన చేస్తున్నారు. నా మీద కోపముంటే నాతో కొట్లాడండి.. మా కార్యకర్తలతో కొట్లాడండి.. మేం తప్పు చేస్తే ప్రజలకు చెప్పండి. వంద రోజుల్లోనే నన్ను గద్దె దించాలని అంటున్న కేసీఆర్‌.. పదేళ్లుగా గద్దె మీద ఉన్న మోదీని ఎందుకు గద్దె దించాలని అనట్లేదు? 

ముదిరాజ్‌ బిడ్డను మంత్రి చేస్తాం.. 
బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనే. రజకబిడ్డ అయిన వీర్లపల్లిని, ముదిరాజ్‌ బిడ్డ శ్రీహరిలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించాం. తెలంగాణలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లను కేసీఆర్‌ విస్మరించారు. కానీ కాంగ్రెస్‌ ముదిరాజ్‌ బిడ్డను ఎమ్మెల్యే చేయడంతోపాటు మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాం. మెదక్‌లో నీలం మధును, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలి.

ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చడంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. కేసీఆర్‌ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే లక్షలాది ముదిరాజ్‌ బిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. ఇప్పటికైనా బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలంటే.. మంచి వకీళ్లను పెట్టి మీ వాదన బలంగా వినిపించాలంటే వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలి. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఆగస్టు 15లోపు ముదిరాజ్‌ బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. 

ఎస్సీ వర్గీకరణ చట్టం బాధ్యత మాదే.. 
ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ పదేళ్లుగా సుప్రీంలో కేసు వాదించకపోతే.. ఉద్ధండులైన న్యాయవాదులతో నేను వాదన వినిపించా. ఎస్సీ వర్గీకరకణ కోసం కొట్లాడిన ఓ వ్యక్తి మోదీకి ఓటేయాలని అంటున్నారు. మరి ఆయనను కేసీఆర్‌ అరెస్టు చేయించిననాడు ఎవరూ పలకరించలేదు. నేను బెయిల్‌ ఇప్పించా.

పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నా.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలిచా. సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా.. అడ్లూరి లక్ష్మణ్‌కు విప్‌గా, పాల్వాయి రజనికి టీఎస్‌పీఎస్సీ మెంబర్‌గా, ప్రీతం కుమార్‌కు చైర్మన్‌గా అవకాశం ఇచ్చాం. రానున్న రోజుల్లో కూడా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో, నియామకాల్లో మాదిగలకు సముచిత స్థానం కలి్పస్తాం. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుంది. 

పాలమూరులో డీకే అరుణ కుట్రలు.. 
డీకే అరుణ బీజేపీ ముసుగులో బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై రేవంత్‌రెడ్డిని పడగొట్టాలని.. బలహీనం చేసి, పాలమూరును ఎండబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేం కురుమ యాదవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని గద్వాలలో సరితకు టికెట్‌ ఇస్తే.. గద్వాల కోటలో కుట్రలు చేశారు. అరుణ నాయకత్వంలో బీజేపీ ఓట్లు బీఆర్‌ఎస్‌కు వేయించి ఓడగొట్టారు. సరిత గెలిస్తే మంత్రి అయ్యేవారు.

అరుణ రాజకీయాలతో ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. ఆనాడు బీజేపీ వాళ్లు బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వాళ్లు బీజేపీకి ఓట్లు వేసేలా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్‌ సూచించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బలహీన వర్గాల వ్యతిరేకి డీకే అరుణ: వంశీచంద్‌రెడ్డి 
డీకే అరుణ బలహీనవర్గాల వ్యతిరేకి అని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘అరుణమ్మ నువ్వు బంగ్లా రాజకీయాలు చేసే దొరసానివి. పూటకో పార్టీ మార్చే దొరసానివి. మక్తల్‌లో శ్రీహరిని ఓడించి.. సొంత పార్టీ అభ్యర్థి జలంధర్‌రెడ్డిని కాదని తమ్ముడు రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలని చూసిన ముదిరాజ్‌ల వ్యతిరేకివి. గద్వాలలో యాదవ సోదరి సరితను ఓడించి అల్లుడిని గెలిపించేందుకు బంగ్లా రాజకీయాలు చేశావు..’’ అని ఆరోపించారు. డీకే అరుణకు పదవుల మీద ఉన్న ప్రేమ అభివృద్ధి మీద లేదని విమర్శించారు.

 వంద రోజుల్లో చాలా పనులు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నారాయణపేట గడ్డపై నుంచి రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. ఏకకాలంలో, ఏకమొత్తంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది. వడ్లకు కూడా రూ.500 బోనస్‌ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. రుణమాఫీ కూడా చేసి తీరుతాం.   

Advertisement
Advertisement