కవిత రూటు ఎటు?.. పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌ ఏంటి? | Sakshi
Sakshi News home page

కవిత రూటు ఎటు?.. పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌ ఏంటి?

Published Mon, Dec 12 2022 8:41 PM

CM KCR And Kavitha Special Focus On Nizamabad District - Sakshi

కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా అందరికీ పరిచయమే. నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచిన ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సీబిఐ కేసు విచారణతో తరచుగా న్యూస్‌లో నానుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడైతే ఓడారో అక్కడే ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనతో ఉన్నారామె. నిజామాబాద్ జిల్లాలో ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? 

నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి
తెలంగాణా రాష్ట్రంలో 33 జిల్లాలున్నా.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ వేదికగా నిజామాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కచ్చితంగా ఓ విశేషమే. ఈ క్రమంలోనే ఇందూరుపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారా అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. నిజామాబాద్ పై సీఎం సమీక్ష తర్వాత... వెనువెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా.. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధి వివరాలను వెల్లడించారు.

సీఎం కేసీఆర్ నిజామాబాద్‌పై ఎందుకంత ఫోకస్ చేస్తున్నారన్న చర్చ మొదలైంది. సీఎం కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే చేస్తారని.. కాదు.. కాదు.. బోధన్ నుంచీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని.. కొందరు ఆర్మూర్ నుంచీ రంగంలోకి దిగొచ్చని.. అటు జగిత్యాల బరిలోనూ నిలువొచ్చనీ పరిపరివిధాలుగా ప్రచారమైతే సాగుతోంది. 

పోటీ చేస్తారా? ఫైట్ చేస్తారా?
ఈ మధ్య బీజేపీ ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత ఎపిసోడ్ తో.. నిజామాబాద్‌లోనే నిల్చి గెలవాలన్న పట్టుదల కవితలో మరింత పెరిగిందంటున్నారు. కూతురు కోరికను అర్థం చేసుకున్న తండ్రిగా కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో కవితనే నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా బరిలోకి దించనున్నారా అనే చర్చ టీఆర్ఎస్‌లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లని కేసీఆర్ తేల్చిచెప్పారంటే... కచ్చితంగా ఆలోచించాల్సిందే అనేవాళ్లూ ఉన్నారు. గతంలో ఎవరైతే బాగా పనిచేస్తారో వారికే సీట్లని చెప్పి.. దాదాపు సిట్టింగ్‌లకే టిక్కెట్లు కేటాయించిన గులాబీ బాస్ మాటల్లో ఆంతర్యాలు అంత త్వరగా అంతు చిక్కనివి.

ఈ సారి కవితను నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ బరిలో దింపి.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గణేష్ గుప్తాను పార్లమెంట్‌కు నిలబెట్టే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గణేష్ గుప్తా కూడా విద్యావంతుడు.. ఉత్సాహవంతుడు కావడంతో ఎంపీగా పార్లమెంట్‌కు పంపితే కూడా బెటరేమోనన్న ఆలోచనతో పాటు.. పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చనే లెక్కలు వేసుకుంటున్నట్టుగా టాక్. ఈక్రమంలోనే కవితను వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దించి గెలిపించి క్యాబినెట్‌లోకి తీసుకుని.. ఇందూరులో తిరుగులేని శక్తి కావాలనే యోచనతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత మధ్య వార్‌లో భాగంగా అరవింద్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి పోటీ చేసి ఆయన్ను ఓడగొడతానన్న కవిత శపథం చేశారు. మరి రానున్న రోజుల్లో ఆ శపథాన్ని నెరవేర్చుకుంటారా? కవిత నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగితే.. మరి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తారు..? లేదంటే, అరవింద్ పోటీ చేసిన సెంటర్ లోనే కవిత బరిలోకి దిగుతారా? కవిత పోటీ చేసే సెగ్మెంట్‌పై పొలిటికల్ సర్కిల్‌ చర్చలు జోరుగా సాగుతున్నాయి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Advertisement
Advertisement