బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దాదాపు ఖాయం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూనే మరో యువనేత చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి హవా మామూలుగా లేదు, రాబోయే కాలమంతా చిరాగ్‌దే అన్నంతంగా చాటిచెప్పాయి ఈ ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో 29 సీట్లను పట్టుబట్టి తీసుకున్న ఆయన.. ఏకంగా 21 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు తగ్గ తనయుడిగా తనదైన ముద్రను వేశారు చిరాగ్ పాశ్వాన్. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పార్టీ ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పేశారు.
ఫీనిక్స్‌లా పుంజుకుని..
చిరాగ్ పాశ్వాన్ తిరిగి పుంజుకున తీరు ఫీనిక్స్ పక్షిని గుర్తు చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళమే. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో విభేదాల వల్ల ఆ సమయంలో ఒంటరిగానే పోటీకి సిద్దమయ్యారు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్.. కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించారు. దాంతో ఆయన రాజకీయ అంధకారంగా కనిపించింది. అదే సమయంలో చిరాగ్ అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు.
అందకారం నుంచి ఆకాశమంత వెలుగు..
ఆపై 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి, రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్ అంతా అంధకారంగానే కనిపించింది.
బిహార్ రాజకీయాల్లో ఓ శక్తిగా వెలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు చిరాగ్‌లో లేవనే విమర్శలు వినిపించాయి. తండ్రిలో ఉన్న చరిష్మా చిరాగ్‌లో లేదని విమర్శకులు అభిప్రాయాపడ్డారు. అయితే ఐదేళ్ల వ్యవధిలోనే ఎంతలా పుంజుకున్నారో తాజాగా ఆయన తన అభ్యర్థులను ముందువరుసలో నిలిపిన తీరే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం స్తైక్‌రేట్ సాధించిన చిరాగ్.. ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు.
#WATCH | पटना: केंद्रीय मंत्री और LJP(रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने NDA के बहुमत का आंकड़ा पार करने पर कहा, "बिहार की जनता ने जिस तरह से NDA को प्रचंड बहुमत दिया है और अगले पांच साल बिहार को विकास की ओर ले जाने का फैसला किया है, उसके लिए मैं विशेष रूप से उन्हें… pic.twitter.com/Lz5lWpDYuA
— ANI_HindiNews (@AHindinews) November 14, 2025
చిరాగ్ అంటే కాగడా అని అర్థం.. ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కాగడా మాదిరి మారి మరింత వెలుగు నింపారు. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని అంధకారం నుంచి ఆకాశమంత వెలుగుల వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చిరాగ్. ఇక బిహార్‌లో అంతా చిరాగ్ శకమే అన్నంత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారాయన.


