గురివిందలా మాటలు.. నక్కజిత్తుల ఆటలు

Chandrababu Naidu Insulted Scheduled Caste In Andhra Pradesh - Sakshi

‘దేశం’ ముని‘కూడలి’ రాజకీయం 

అప్పుడు అలా...ఇప్పుడు ఇలా...  

నాడు రాజప్ప సోదరుడిని వెనకేసుకొచ్చిన వైనం

తునిలో అన్యాయంగా దళితులపై కేసులు  

ఓ కొంగ ఓ చెరువు పక్కన ఒంటి కాలిపై జపం చేస్తున్నట్టు నటిస్తోంది. అది చూసిన చెరువులో చేపలు ఎంతో సంతోషించాయి. తమ శత్రువు ఆధ్యాత్మికంగా మారిపోయాడని ... ఇక తమ బతుకులకు ఢోకా ఉండదని భ్రమపడి పైకి వచ్చి స్వేచ్ఛగా విహరించసాగాయి. అంతే తన దగ్గరకు వచ్చిన ఒక్కో చేపను గుటుక్కున మింగి మళ్లీ జపం చేస్తున్నట్టు నటించేది. కొద్ది రోజులకు కుట్రను గమనించిన ఆ చేపలు దేవుడి దగ్గరకు వెళ్లి ‘మమ్మల్నే కాదు... జపం పేరుతో మిమ్మల్ని కూడా మోసం చేసిందని...మమ్మల్ని రక్షించండని ప్రభూ’ అని వేడుకున్నాయి.

ఇప్పటికి కళ్లు తెరిచారు కదా...ఇక నుంచి మీకు రక్షే వెళ్లండ’ని దీవించి పంపించాడు దేవుడు. ఆ కథలోలా అప్పటి సీఎం చంద్రబాబు కొంగ జపం చేసి రాష్ట్ర దళితులను వేధించుకు తినడమే కాకుండా తీవ్ర అవమానాలకు గురిచేశాడు. అయితే ఆ అమాయక చేపల్లా ఇక్కడి దళితులు ఎవరినీ వేడుకోలేదు..ఆ కుట్రలను, మోసాలను గమనించారు. పిడికిలి బిగించి వాస్తవాలను గ్రహించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని దాదాపుగా సమాధి చేశారు. అయినా బుద్ధి తెచ్చుకోని ఆ నేతలు ఇంకా కుటిల రాజకీయాలకు తెరదీస్తూనే ఉన్నారు.  

సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద గింజ మాదిరిగా మాటలాడుతూ నక్క జిత్తుల రాజకీయాలకు తెరదీస్తున్న టీడీపీ నేతలపై దళిత వర్గ ప్రజలే మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న దళిత ఘటనల్లో స్పందనకు ... వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తక్షణ చర్యలకు నక్కకు...నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆ వర్గ నేతలే ఉదాహరణలతో చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్‌లో నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా న్యాయం అందని ద్రాక్షే. బాధితులు న్యాయం కోసం  వెళితే అది దక్కకపోగా ఎదురు కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు. అటువంటి పరిస్థితులన్నీ ఈ ఏడాది కాలంలో పూర్తిగా మారిపోయాయి. తప్పు చేసే వారు ఎంతటి వారైనా చివరకు సొంత పార్టీ వారైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వదిలి పెట్టడం లేదు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు, వారి తాబేదారులకు కంటగింపుగా మారింది.   

మునికూడలి ఘటనలో తక్షణ చర్యలు 
సీతానగరం మండలం మునికూడలిలో ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తికి కాలు విరిగిందని (కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు విజయ్‌ తనను లారీ ఢీకొట్ట లేదని బైక్‌ బోల్తా పడి పడిపోయానని, తన పేరు, కులాన్ని అనవసరంగా నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు.) దళిత యువకులు లారీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అటుగా కారులో వెళుతున్న మునికూడలి వైఎస్సార్‌సీపీ నేత కవల కృష్ణమూర్తి ఆ వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా వారు అతని కారు అద్దాలు పగలగొట్టారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం)

వారించిన అడపా పుష్కరాన్ని కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఐదుగురు దళిత యువకులపై వారిచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 20న ఒక నిందితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి సిబ్బందితో కలిసి చిత్రహింసలకు గురిచేసి జుత్తు కత్తిరించిన ఘటనపై  స్వయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించి జారీ చేసిన ఆదేశాలతో ఇన్‌చార్జ్‌ ఎస్సై ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. వరప్రసాద్‌ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. బాధ్యత కలిగిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆస్పత్రిలో ఉన్న బాధితుడు వరప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఇవిగో సాక్ష్యాలు..
ఏవీ చర్యలు ? చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు ?
తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థిక  మంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డారు. 
2016లో తుని కాపు గర్జన అనంతరం ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్‌ కేసులతో వేధింపులకు పాల్పడింది.
ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్‌లో అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగిన పాపానికి దళితులపై అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. (ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ)

బాబు హయాంలో ఎదురు దాడులే కదా... 
చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కుక్క యజమాని అప్పటి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయానా సోదరుడు జగ్గయ్యనాయుడే. హోం మంత్రి సోదరుడు కావడంతో దళిత సంఘాల ఒత్తిడి నేపథ్యంలో చాలా రోజుల తరువాత కేసు నమోదు చేసినా ఆ దళిత బాలుడు పెంపుడు కుక్క తరమడం వల్లే కాల్వలో పడి చనిపోయాడని ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలో నివాసం ఉండే  రాజప్ప కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా మనసు రాలేదు.  తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డ ఘటనలు కోకొల్లలు.

తాండవ నదిలో యనమల సోదరుల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురిపై అక్రమ కేసులు బనాయించారు.  2016లో తుని కాపు గర్జన అనంతర ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్‌ కేసులతో వేధింపులకు పాల్పడింది. ఆ బాధితుల జాబితాలో ప్రస్తుత ఎస్సీ మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీ, కోటనందూరు మండలం భీమవరపుకోట మాజీ సర్పంచి జిగటాల వీరబాబు, బీసీ వర్గానికి చెందిన లగుడు శ్రీను, కొయ్యా శ్రీను, రేలంగి రమణాగౌడ్‌ ఉండటం గమనార్హం.  ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్‌లో అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపు విషయంలో  ఆందోళనకు దిగినందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. ఈ వివాదంలో ఆ నియోకవర్గం మొత్తం మీద 400 మంది దళితులపై కేసులు బనాయించారు.

రాజకీయ రంగు... 
సీఎం స్థాయి నుంచి ఎస్పీ వరకూ అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చర్యలు తీసుకున్నారు. ఇంత చేస్తే కేవలం ప్రచారం, రాజకీయ ఉనికి కోసం టీడీపీ తెర వెనుక ఉండి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగుతోంది. దళితులు వైఎస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారనే దుగ్ధతో వారిని పార్టీకి దూరం చేయాలనే కుట్రలో భాగంగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మునికూడలి ఘటనలో బాధితుడు వరప్రసాద్‌ టీడీపీ క్రియాశీలక కార్యకర్త. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవల కృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీ నాయకుడు. ప్రభుత్వం పార్టీ పక్షాన నిలిచి ఉంటే కృష్ణమూర్తిపై కేసు నమోదయ్యేదా, ఎస్‌ఐ ఇతర పోలీసుల సస్పెన్షన్, ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసు నమోదు చేసే వారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిష్పాక్షికత కనిపిస్తున్నా మాజీ ఎంపీ హర్షకుమార్‌ వంటి నాయకులు ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేయడాన్ని దళిత మేధావులే గర్హిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top